Saturday, May 2, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 12

*దృశ్య శ్రవణ అష్టావధానము - 12*

స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంతఋతువు , వైశాఖ మాసం, శుద్ద నవమి
శనివారం, తేది 02-05-2020

అవధానవర్యులు

*శ్రీ దోరవేటి గారు*


సంయోజకులు: 

*శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు*

నిర్వహణ : 

*శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు*

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు* 

౧) సమస్య: శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
౨) దత్తపది: శ్రీమతి కోటంరాజు రమాదేవి గారు
౩) వర్ణన : శ్రీమతి ఉప్పల పద్మ గారు
౪) న్యస్తాక్షరి: శ్రీ మధుసూదన్ రావు గారు
౫) ఆశువు: శ్రీమతి మచ్చ అనురాధ గారు
౬) అప్రస్తుతం: శ్రీ సాగర్ల సత్తయ్య గారు
౭) దృశ్యం : శ్రీ పసుల హనుమంత్  గారు
౮) అంత్యాద్యక్షరి: శ్రీమతి పార్నంది లలితా కృష్ణమూర్తి గారు


సంయోజకుని ప్రశంస
*చెన్నయ దోరవేటి ! పద చిత్రపు కాంతులవాటి! ధారలో*
*నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడు మేటి! గాత్రమా,*
*క్రొన్నెలదేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ*
*చెన్నయకేరి సాటి ధర? చెల్వగు వందనమందుకొమ్మికన్!*

*తీయని పద్యధార, వెనుదీయని శాబ్దిక శిల్పమద్దియే!*
*హాయిగ సాగుతూగు, మనసంత వసంతము లొల్కునట్లు, 'నో*
*హో' యనిమెచ్చునట్లు, పరమోన్నత పద్యపు భాతిపంచె తా,*
*నా యన దోరవేటి! ఘనుడన్నగ నెన్నగ మేటివాడహో!!*
      -అవుసుల భానుప్రకాశ్.


అవధాని ప్రార్థన:
శివరూపంబగు తల్లి దండ్రులు గురుల్ శ్రీకార బృందారకుల్
కవనంబన్నది దివ్యగంగ సుకవుల్ గాంచంగ విఘ్నేశ్వరుల్
అవధానంబు సరస్వతీ చరణమౌ నర్చాత్మకుల్ పృచ్ఛకుల్
భువి నీరీతిగ దేవతాళి నెదలో పూజించి ప్రార్థించెదన్!

మేటికి గోగులపాటి  కి
రీటికి నవధాన నిత్య కృత్య సుకవితా
వాటికి మోహనకృష్ణ కు
మాటికి మాటికిని నతులు మాన్యచరితుకున్!

సారథి సాహితి సంఘము
సారథి యవధాని భాను సారథి యయ్యెన్
నే రథిగా నవధానము
సారసమున నడుపు మనుజ! సత్కవిరాజా!

పృచ్ఛకశ్రేష్ఠులార! సద్విబుధులార!
ప్రశ్న లడుగుడి వాగ్దేవి భవ్యమైన
దీవెనలుగ పద్యముల నందింతు నేను
మేటి పద్యార్చకులు మేలు మేలనంగ...



౧) సమస్య: శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు

సమస్య
దృశ్యశ్రవణ అష్టావధాన నిర్వాహకులు శ్రీగోగులపాటి కృష్ణ మోహన్ గారికి, ఈనాటి అవధానసంచాలకులు శ్రీఅవుసుల భానుప్రకాశ్ అష్టావధాని గారికి..అదేవిధముగా నేడు అష్టావధానము చేస్తున్న అష్టావధాని శ్రీదోరవేటిగారికి నమస్సులతో....
ఇస్తున్న సమస్య.....
*పాపముఁజూచి మెచ్చి భగవంతుడు భక్తినొసంగి గాచెడిన్*
ఐతగోని వేంకటేశ్వర్లు నల్లగొండ
అష్టావధాని
సమస్య
పాపముఁజూచి మెచ్చి భగవంతుడు భక్తినొసంగి గాచెడున్

అవధాని పూరణ
లోపములెన్నొ మీరగను లోకులు శోకమునందుమున్గి సం
తాపము మీర స్వార్థమున ధారుణినేరము లెన్నొచేయుచున్
గోపముతోడనొండొరులు కొట్టుకొనంగను నాపజూచు దీ
పా పముఁజూచి మెచ్చి భగవంతుడు భక్తినొసంగి గాచెడున్

దత్తపది: శ్రీమతి కోటంరాజు రమాదేవి గారు

డా" కోటంరాజు రమాదేవి.
అంశం: దత్తపది
విషయం: "కరోనా" మూలంగా బోసిపోయిన "తిరుమల" క్షేత్రం తిరిగి లక్షలాది భక్తులతో నిత్యకళ్యాణం,పచ్చతోరణంగా వెలుగొందాలని ఆశిస్తూ పద్యం చెప్పాలని అవధానిగారిని ప్రార్థిస్తున్నాను.🙏
 పదాలు: నయము
               రయము
               భయము
                జయము

అవధాని పూరణ
తే"గీ:  భయము వలదు కరోనా అనయముగాదు
రయముగా నేగు నదియు నిరయము జేర
మరల దీవించు వెంకన్న మమ్ము మిమ్ము
జయము లోకములోని సుజనుల కెల్ల.


వర్ణన : శ్రీమతి ఉప్పల పద్మ గారు

ముందుగా అవధాని శ్రీ దోరవేటి గారికి, సంయోజకులు శ్రీ అవుసుల భానుప్రకాశ్  గారికి,
నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి మరియు నా సహ పృఛ్ఛకులందరికీ హృదయపూర్వక నమస్సులు. 🙏🙏🙏
నా పేరు : ఉప్పల పద్మ
అంశం : వర్ణన
 హుస్సేన్ సాగర్ లో గణపతి విగ్రహ నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో శివ పార్వతుల మనోస్థితిని  స్వేచ్ఛా ఛందంలో  వర్ణించగలరు.
ధన్యవాదాలు. 🙏🙏

వర్ణన : హుస్సేన్ సాగర్ లో గణపతి విగ్రహ నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో శివ పార్వతుల మనోస్థితిని స్వేచ్ఛా ఛందములో వర్ణించగలరు.

అవధాని గారి వర్ణన :-

వర్ణన:
"హిమసుత నీదు నందనుని యింపుగ గంగను ముంచు " "మేల?" "తా
నముకయి" చేసె సాగరము నం" "దది వైతరణీనదీ సమా
నముగద!" "ముగ్ధభక్తిని గనంగను వాసన యేల గల్గు నో
శమదమ రూప! " యన్న విని శంభుడు నవ్వెను హాయి హాయిగా !

దృశ్యం : శ్రీ పసుల హనుమంత్  గారు

నా పేరు పసుల హనుమంత్,
వికారాబాద్ జిల్లా.

దృశ్య,శ్రవణ అవధానానికి నమస్కారం🙏
నాకు అవకాశం కల్పించిన
నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష మోహన్ గారికి,
బహుముఖ ప్రజ్ఞాశాలి, పూజ్య గురువులు ,
అవధాని శ్రీ దోరవేటి గారికి,
కార్యక్రమ సంయోజకులు అవుసుల భానుప్రకాశ్ గారికి మరియు పృచ్ఛకులకు నమస్కారం🙏

అవధాని గారిని నేనడిగే అంశం *దృశ్యం*..

ఈ దృశ్యానికి తగిన వర్ణన చేస్తూ పద్యాన్ని చెప్పవలసిందిగా అవధాని శ్రీ దోరవేటి గారిని ప్రార్థిస్తున్నాను.


అవధాని పూరణ
కూటికి గుడ్డకున్ వగచి కోర్కెలు గుండెలలోన దాచి స
య్యాటలు పాట లీతలు నిరంతర మాలను గాయు కృత్యముల్
చీటికి మాటికిన్ గురుల చేతను  పోలెల నారగింపులున్
నేటికి తీపి గుర్తులయు నిండె మనంబున దృశ్య రూపమై
ధన్యవాదాలు🙏

   
ఆశువు: శ్రీమతి మచ్చ అనురాధ గారు

మచ్చ.అనురాధ.
సిద్దిపేట.

నేనిచ్చిన 
అంశము : ఆశువు

హిరణ్యకశిపుడి భార్య   లీలావతి గర్భవతి గా నున్నప్పుడు  నారదమహర్షి విష్ణు భక్తి తత్వాన్ని
బోధిస్తున్న విధానమును  ఆశువుగా  పద్యం తెల్పండి .

ఆశువుగా  అవధాని గారు చెప్పిన పద్యం.

తేటగీతి.

ఆశువు:
సర్వతో వ్యాప్తియై యుండు నిర్వికారి
సర్వదా భక్తులను గాచు చక్రధారి
నమ్మి కొలిచెడివారి ననారతమ్ము
ప్రేమతోడుత రక్షించు విష్ణుమూర్తి !
👌👌💐💐🙏🙏🙏🙏


న్యస్తాక్షరి: శ్రీ మధుసూదన్ రావు గారు

నా పేరు కడియాల మధుసూదనరావు, 
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడిని.
అవధాన సభాసరస్వతికి అభివందనాలు. ఈ రోజు  దృశ్యశ్రవణ అష్టావధానం చేయబోతున్న శ్రీ దోరవేటి కవి గారికి, నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారికి, పృచ్ఛక పండితులకు నా నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు.
నాకు ఇచ్చిన అంశం న్యస్తాక్షరి.
తెలంగాణ అనే పదంలో
తె అక్షరం 1వపాదం మొదటిఅక్షరంగా,
లం అక్షరం రెండో పాదం మూడవ అక్షరంగా,
గా అక్షరం మూడో పాదం నాల్గవ అక్షరంగా,
ణ అక్షరం నాల్గవ పాదం ఐదవ అక్షరంగా ప్రయోగిస్తూ భారతంలోని భీష్ముని కథ ఒక మత్తేభం లో వర్ణించండి


*అవధాని పూరణ*
తెలిసెన్ తండ్రి విచార కారణము బుద్ధిన్ యోచనన్ జేయగా
కలలందైనను తండ్రి సౌఖ్యమునకున్ గాసేది గానీని ని
శ్చలు గంగాసుతు బ్రహ్మచర్యము ప్రతిజ్ఞన్ జేసి భీష్ముండుగా
నిలలో రాణకు నెక్కె దేవతలు దీవింపంగ హర్షంబునన్


అంత్యాద్యక్షరి: 
శ్రీమతి పార్నంది లలితా కృష్ణమూర్తి గారు

అవధాని గారికి నమస్కారం🙏
నా పేరు లలితాకృష్ణ 
నా అంశం 
అంత్యాద్యక్షరి 

రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా
రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావనవ్రతో 
ద్దాముడు రాముడే పరమ దైవము మాకని మీ యడుoగు కెం
దామరలే భజించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

అవధాని పూరణ

అంత్యాద్యక్షరి:
ధీరుడు మేఘస్వన గం
భీరుడు నసురాళి నణచు భీకరయోధుం
డారయ శ్రీ రఘురాముడు
శ్రీ రమ్యుడు మిమ్ము గాచు! చిరయశ మిచ్చున్!



అప్రస్తుతం: శ్రీ సాగర్ల సత్తయ్య గారు

సభా సరస్వతి వందన మందారాలు. నా పేరు సాగర్ల సత్తయ్య నల్లగొండ. తెలుగు భాషోపాధ్యాయుడను. నా అప్రస్తుత ప్రసంగం లో మొదటి ప్రశ్న
 అయ్యా అవధానిగారూ
పండితుండు అని మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు కదా పండితుండు అంటే ఎవరండీ
 తుండు వేసుకొని పండే వాడా?

అప్రస్తుతం ప్రశ్న 1
పండితుండు కానీ మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు కదా పండితుండు అంటే ఎవరండీ
 తుండు వేసుకొని పండే వాడా? 

 అవధాని సమాధానం
 పండితుండు అంటే పండిన అనుభవంతో దోషాలను తుంచేవాడు

 అప్రస్తుతం ప్రశ్న 2

అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అంటారు కదా మరి ప్రియురాలు అయితే ఏం చూస్తుంది అంటారు? 

 అవధాని సమాధానం
 ఆ ఏముంది.. తలను చూస్తుంది... ఇంకా ఎన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయా అని...

 అప్రస్తుతం ప్రశ్న 3
 అవధాని గారు గణపతి నిమజ్జనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే... కానీ పాపం బుద్ధుడు ప్రతిరోజు హుస్సేన్ సాగర్ లో నిలబడి ఉంటాడు కదా... అతని పరిస్థితి ఏమిటంటారు? 

 ఆయన తామరాకు మీద నీటి బొట్టు... లేదా కొలనులో తామరాకు...


అభినందనలు

దోరవేటి గారు,ఈ అవధానం మీ శేముషీవైభవానికెత్తిన వైజయంతిక.
జాతికి మరో అవధాన రత్నం దొరికాడన్న మాన్యశ్రీ మెట్టు రామశర్మ గారి మాట సార్థకమైనది.
ఆశీరభినందనలతో.. 
      ఎం.సాంబశివశర్మ. వికారాబాద్.


అవలీలగ నవధానము
 కవి లోకము మెచ్చు నటుల కమనీయంగా
చవులూరగ గావించిన 
అవధానీ  దోరవేటి  అభివందనముల్ 

                  - విధేయుడు
                 సాగర్ల సత్తయ్య
                   నల్లగొండ


వర్ణన విభాగంలో నేనిచ్చిన అంశానికి చక్కని పద్యంతో పూరణ గావించిన అవధాని శ్రీ దోరవేటి గారికి అభినందన వందనములు.  అనిర్వచనీయమైన వారి పాండిత్య ప్రతిభకు పాదాభివందనములు. 🙏🙏
   అవధానంలో పాల్గొనే అవకాశం కల్గించిన నిర్వాహకులు గోగులపాటి కృష్ణ మోహన్ గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు. మరియు 
సంయోజకులుగా బహు బాగా వ్యవహరించిన అవుసుల భాను ప్రకాశ్ గారికి నమస్సులతో  ధన్యవాదాలు.. 🙏🙏🙏
       - ఉప్పల పద్మ 
       నల్లగొండ జిల్లా.


ఇంకాసేపు ఉంటే బాగుండుననిపిస్తుంది...దృశ్య శ్రవణ అవధానం బ్రహ్మాండం💐💐..నిర్వాహకులకు,సంయోజకులకు,శ్రీ అవధాని గార్లకు నమస్కారం🙏
ధన్యవాదాలు🙏🙏

🌷 *ఆటవెలది*🌷

దోరవేటి గురుడు దొడ్డమనసుతోడ
నాదు బాల్య స్మృతుల నాకుజెప్పి
యిట్టి సంతసంబునెదయందు నింపిరి
వందనములుజేతునందుకొనుడి

🌷మణి పూసలు🌷

బహుముఖ ప్రజ్ఞాశాలి
తల్లివలె సహనశీలి
బహుకళల కాణాచి
కరుణా సద్గుణశీలి

పద్యరచన వీరుడు
కథా నవలకారుడు
దోరవేటి కళలలోన
సాటిలేని చతురుడు .
                                                       
మీ శిష్యుడు....
పసుల హనుమంత్,అక్కాపూర్

ఒకర కృష్ణమూర్తి, మరొకరు భానుమూర్తి, వారి నయన చతుష్కం పర్యవేక్షణలో అవధానం అమందానంద సుందరనందనం. ఇద్దరికీ నమోవాకాలు.

అంజయ్య గౌడ్, అష్టావధాని
అన్నయ్య దోరవేటిగారికి అభినందనలతో
కం..
హవనంబై యలరారెను
నవధానము దృశ్యశ్రవణ మాద్యంతబున్
అవధాని దోరవేటికి
ప్రవిమల మగు వందనమిడి బ్రస్తుతి జేతున్


తెలుగు వారి స్వంతమైన అవధానప్రక్రియను ఈ తరము వారికే కాక రాబోయే తరము వారికి తెలిసే విధముగా నిర్వహిస్తున్న గోగులపాటి కృష్ణమోహన్ గారికి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్థితప్రజ్ఙులు, అవధాని శ్రీ దోరవేటి గారికి, ఈ కార్యక్రమములో పాల్గొన్న ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు మీకు సమకాలీనుడిగా జన్మించడం నా అదృష్టము
సదా మీ అభిమాని
చల్లగాలి వెంకటరాజు

నేటి దృశ్య, శ్రవణ అష్టావధానంలో అవధానిగారు దోరవేటి గారికి అభినందనలతో

_"దోరవేటి" యన్న పూరణ ధారలై_
_జోరు నందు కునెడి పారు ధేన_
_కోరి యడగ పృచ్ఛ ధోరణికిని వారు_
_కూరుపరియె గాదె ? భూరి యగుచు_

                 ..................... _*శ్రీ*_. ✍


శ్రీ దోరవేటి గారి 
అవధానము లో 
 పాల్గొనె అవకాశం
కల్పించిన  శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ సార్ గారికీ ,
అలాగే ఈ కార్యక్రమ
సంయోజకులు అవుసుల భానుప్రకాశ్  సార్ గారికి
ధన్యవాదాలు.
మచ్చ.అనురాధ.
సిద్దపేట.
💐💐💐💐
🙏🙏🙏🙏🙏


ఐతగోని వెంకటేశ్వర్లు, అష్టావధాని
నేటి దృశ్యశ్రవణ అష్టావధానములో నేనిచ్చిన సమస్యకు చక్కటి రసవత్తర లలితపూరణగావించిన అవధాని శ్రీదోరవేటివారికి నమస్సులతో యభినందన పద్యమాల 

ఎండల్ మండగ దోరమావి రసమై యేపారుచున్ పారుచున్ 
నిండెంచెన్ మదులందు మోద ఝరులన్ నీరంధ్రమౌ ధారతోన్ 
బండెన్ బాకముతోసమస్య అవధానంబంత పూర్ణంబయెన్ 
దండాలిత్తును దోరవేటి యవధానార్యాసు దామమ్ముగాన్


అవుసుల భానుప్రకాశ్, అష్టావధాని
*చెన్నయ దోరవేటి ! పద చిత్రపు కాంతులవాటి! ధారలో*
*నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడు మేటి! గాత్రమా,*
*క్రొన్నెలదేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ*
*చెన్నయకేరి సాటి ధర? చెల్వగు వందనమందుకొమ్మికన్!*

*తీయని పద్యధార, వెనుదీయని శాబ్దిక శిల్పమద్దియే!*
*హాయిగ సాగుతూగు, మనసంత వసంతము లొల్కునట్లు, 'నో*
*హో' యనిమెచ్చునట్లు, పరమోన్నత పద్యపు భాతిపంచె తా,*
*నా యన దోరవేటి! ఘనుడన్నగ నెన్నగ మేటివాడహో!!*
      -అవుసుల భానుప్రకాశ్.


అవధాని ముగింపు పద్యాలు
అవధాన సారథి అవుసుల భానుకు 
         ముఖ్యుడయిన కృష్ణ మోహనునకు 
నేటి సమస్యకు మేటి వధానియౌ 
           వేంకటేశ్వర నామ విబుధవరుకు 
న్యస్తాక్షరి యిడిన నయగుణశీలురు 
             మధుసూదనునకు సమంచితముగ 
వర్ణన గోరిన పద్మకున్ భక్తితో 
             
              దత్తపదినిడిన ధరణి  రమకు 

ఆశు విచ్చిన అనురాధ అతిశయముకు 
రమ్యమంత్యాక్షరినిడు లలిత మతికి 
సరస మప్రస్తుత ప్రయోక్త సత్తయకును 
దృశ్య మిచ్చిన హనుమంతు ధీమతికిని 
వందనాశీస్సు లివె మీకు నందుకొనుడి!

యూ ట్యూబ్ లింక్ కోసం

https://youtu.be/impLDEbJOmo


స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్

Friday, May 1, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 11 (మహిళా అవధానము)

దృశ్య శ్రవణ అష్టావధానము - 11
(మహిళా అవధానము)
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంతఋతువు , వైశాఖ మాసం, శుద్ద సప్తమి
గురువారం, తేది 30-04-2020

మహిళా అవధాని : 

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు


సంయోజకులు: 

*శ్రీమతి జ్ఙానప్రసూన గారు*


నిర్వహణ : 

*శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు*

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకురాళ్ళు*

౧) సమస్య - శ్రీమతి పద్మ చిగురాల గారు
౨) దత్తపది - శ్రీమతి ముత్యంపేట గాయత్రీ దేవి గారు
౩) వర్ణన - శ్రీమతి లక్ష్మీ పద్మజ గారు
౪) ఆశువు - శ్రీమతి స్వర్ణలత గారు
౫) దృశ్యము - శ్రీమతి లక్ష్మీ మదన్ గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీమతి హారిణాపవన్ గారు
౭) న్యస్తాక్షరి - శ్రీమతి ముదిగొండ మణిమాల గారు
౮) నిషేధాక్షరి - శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు

అవధాని ప్రార్ధన

నిను సేవింపగ నిత్యము
ఘనమౌ సంతృప్తి కలిగె కరుణాభరణా
కనుచూపులలోనీవై
మనుమా నాతలపులోన మహితప్రకాశా

సమస్య - శ్రీమతి పద్మ చిగురాల గారు


అవధాని గారికి నమస్సులు.
అంశం..సమస్య
జంబూకంబునకక్క  గావలె సుమా ! శ్వానంబు శార్దూలముల్.

ధన్యవాదాలు.🙏🏻
పద్మ చిగురాల...

సమస్యాపూరణము...
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు.

క్రమాలంకారములో
శా.
సంబంధంబులు గానకన్ కుటిలతన్ స్వార్థంబునే జూపినన్
సంబంధీకులన్న ప్రేమనిరతిన్ విశ్వాసమున్ జూపుగా
అంబాయన్నను జాలిలేక తినుగానాసక్తితో దూడలన్
జంబూకంబునకక్క  గావలె సుమా ! శ్వానంబు శార్దూలముల్.



దత్తపది - శ్రీమతి ముత్యంపేట గాయత్రీ దేవి గారు


నాపేరు:- ముత్యంపేట గాయత్రీదేవి
అంశం :-దత్తపది
పదాలు:- నేర్పు .కూర్పు. మార్పు. చేర్పు
ఈపదాలతో ప్రస్తుత పరిస్థితులలో గృహిణి జీవనాన్ని వర్ణించండి
మీ స్వేచ్ఛావృత్తంలో

దత్తపది పూరణ :-
నేర్పునుచూపుచున్ మహిళనిండుమనమ్మునజేయుకృత్యముల్
కూర్పునొసంగుబంధములు కోమలమై రవళింపప్రేమతోన్
మార్పులనేసహించిబహుమానములేకయెతృప్తిజెందుచున్
చేర్పులకైన సిద్ధపడుసేవలొసంగును భృత్యురాలిగన్ !

వర్ణన - శ్రీమతి దుగ్గరాజు లక్ష్మీ పద్మజ గారు


సభకు నమస్కారం
నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
ఈనాటి అవధాన కార్యక్రమం లో నా అంశం వర్ణన

శ్రీ రాముడు సీతాదేవి పాదాలకు లత్తుక రాస్తున్నప్పుడు చెట్టు చాటు నుండీ చూసిన సూర్పణఖ మనసులోని భావావేశం గురించి వర్ణించవలసినదిగా అవధాని గారిని కోరుకుంటున్నాను,,  ధన్యవాదములు
లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
హైదరాబాద్

వర్ణన పూరణ

కోమలి లేత పాదములకు నునుపత్ర శోభకూర్చగా
రాముడు చేతదాల్చె రసరమ్యములై మురిపించు లత్తుకన్....
ఆ మది పుష్పసోయగం హాయినింపుచు నద్దె మెత్తగన్
నా మది బ్రద్దలయ్యే గదా నాకది ఎంతటి క్షోభ గూర్చెగా
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఆశువు - శ్రీమతి స్వర్ణలత గారు


అవధానిగారికి నమస్కారములు.
పేరు :కొండపాక స్వర్ణలత.
అంశం : ఆశువు.
గృహిణిగా, వృత్తిపరంగా స్త్రీ యొక్క స్వేచ్ఛ, బాధల పరంపరను పద్యరూపములో అందించుమని కోరడం జరిగినది 🙏🏻

*అవధాని గారి పురణ*
గృహిణిగ బహు బాద్యతలన్
అహరహము  శ్రమించి కూర్చునానందమునన్
సహనము చూపును వృత్తిన
తుహినము వలె కరుగు మనసు దుఃఖములందున్.


దృశ్యము - శ్రీమతి లక్ష్మీ మదన్ గారు

అవధాని గారికి నమస్కారం
నా పేరు లక్ష్మీ మదన్, హైదరాబాదు.

నాకిచ్చిన అంశం దృశ్యం..

నేను ఇచ్చిన పై దృశ్యం
మృగశిర కార్తె లో తొలకరి జల్లు పడగానే రైతులు నాగళ్లని బాగు చేయించుకుని వ్యవసాయం కొస సిద్ధం అవుతాడు..దీనిని మీరు ఉత్పలమాల లో చెప్పగలరు.

ధన్య వాదములు🙏
సంయోజకులు శ్రీమతి ప్రసూన గారికి అభినందనలు

నేటి అవధాన కార్యక్రమం లో శ్రీమతి లక్ష్మీ మదన్ గారు అడిగిన  అంశం " దృశ్యం " గురించి నేటి అవధాని గారు  శ్రీమతి శ్రీదేవి గారు ఇచ్చిన పూరణ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మల్లెలు జల్లులై కురిసె మాధురి నింపెను వర్ష ధారలే
కొల్లలు కాగా రైతు మదికూర్చెను సంతసముల్ విహారమై !
మెల్లగ దాల్చె నాగలిని మెండగ నుచ్చు గతాస్రవంతిలో
చల్లగ విత్తనంబులను చక్కని పంటలు రూపుదిద్దగన్
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


అంత్యాద్యక్షరి - శ్రీమతి హారిణాపవన్ గారు

అవధాని గారికి నమస్కారములు.
పేరు:కొరిడె హరిణాపవన్
అంశం:అంత్యాదక్షరి
మొల్ల రామాయణంలోని
రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్
నకారంతో ముగిసింది..

అవధాని గారిపూరణ పద్యం..
నటనలు నయవంచనముల్
జటిలములై జీవితమున సంకటములన్
మటుమాయమవును క్షీమము
కుటిలములను మానుకొనిణ కూరునుయశముల్

న్యస్తాక్షరి: శ్రీమతి ముదిగొండ మణిమాల గారు

అవధానిగారికి నమస్కారములు .
పేరు : ముదిగొండ మణిమాల
అంశం : న్యస్తాక్షరి
చంపకమాల వ్రుత్తములో ప్రతి పాదమునందలి ఆద్యక్షరములు "మ. గు ,వ , లు '' అని వచ్చేలా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ పద్యపూరణ చేయగలరని మనవిచేయగా చక్కని ఆణిముత్యాన్ని ఇలా అందించారు
💐💐💐💐💐💐💐💐💐
న్యస్తాక్షరి పూరణ

"మరుపుకురాని సేవలివి మానిని నిత్యము నొనర్చు క్రుత్యముల్
గురువుగ విద్యలన్ గరుపు కూర్చు యశంబుమందునన్
వరుస జయంబులన్ గనగ ఫక్కున నవ్వుచు ప్రోత్సహించు మే
లు రతనములట్లు పల్కు బహులుప్త మగున్ విసుగుల్ విరామముల్ '
💐💐💐💐💐💐💐💐💐



నిషేధాక్షరి - శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు

అవధానిగారికి నమస్కారములు
పేరు: సింగీతం సంధ్యా రాణి
అంశం: నిషిద్దాక్షరి
శ బ అనే అక్షరాలను నిషేధిస్తూ శిబి చక్రవర్తి ప్రాశస్త్యము ను స్వేచ్ఛా వృత్తము లో చెప్పగలరని మనవి🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అవధాని గారి పూరణ

పక్షిని కాపాడంగా
నక్షయముగ త్యాగధనుడ నాయాసముగన్
రక్షణకు మాంసము నొసగెన్
చక్షువులే చిమ్మరిల్లె సాహస భృతితో

అభినందనలు

అవధాని గారి అభినందనలు
ముగింపు

చక్కని అంశము లొసగిరి
అక్కలు చెల్లెళ్ళుగాను నవధానమునన్
తక్కువ గామిక మీమని

మక్కువగా నేడు సభకు మహరాణులుగన్
చుక్కాయపల్లి శ్రీదేవి

అభినందనలు
💐💐💐💐💐

అవధాని గారికి
*************
కం.

చుక్కాయపల్లి వారలు
చక్కని పద్యాల చేత సభనలరించన్
దిక్కులనిండ గ మీ ప్రభ
అక్కా! శ్రీ దేవి మీకునంజలులివియే

కృష్ణమోహన్ గారికి
***************
తే.గీ.
*****

కృష్ణ మోహను లీరీతి తృష్ణ తోడ
సాహి తీసేవ జేయుచు సదమలముగ
చదువులమ్మను మెప్పించి సంతసమున
ధన్య తనుగొనె చూడనీ ధరణిలోన

పృచ్ఛకులకు
***********
కం.
****
మహిళా యవధానమ్మిట
మహిళలె పృచ్ఛకులుగాను మాన్యత నొప్పన్
మహిలో నెన్నడు జూడని
మహదానందమును గొలిపె మంగళ కరమై

💐💐💐💐💐💐💐💐💐
జ్ఞానప్రసూనాశర్మ ఎల్లికంటి
కడ్తాల- రంగారెడ్డి జిల్లా


నేనిచ్చిన అంశానికి (ఆశువు ) మంచి పద్యం తో పూరణ గావించిన మహిళా అవధాని  శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి   అభినందన వందనములు🙏🙏
 అవధానం లోపాల్గొనే అవకాశం ఇచ్చిన
నిర్వహకులు శ్రీ  గోగులపాటి కృష్ణమోహన్ గారికి,   సమన్వయ కర్త శ్రీమతి  జ్ఞానప్రసూనా శర్మగారికి  గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు🙏
కొండపాక  స్వర్ణలత. 
రామాయంపేట.

 🌹🍀🌹
నా స్పందన.....శుభాభినందనల మాల.💐👏👌🏻🌹

చిక్కని కవితా ధారతొ                           
చక్కని యవధానియయ్యె  సభికుల  తోడన్                                          చుక్కా యని శ్రీదేవియు                         
చక్కటి పద్యంబు చెప్ప చతురత చూపెన్.

పాదము  పద్యము చెప్పుట           
కాదనకనె పూర్తిచేసె కర్ణామృతమై                                                    శ్రీదేవికి పద్యంబులు               
పూదండల నల్లినట్లు పొసగెను యిచటన్....

    పద్మ చిగురాల...🙏🏻🌹👏

 అనుసంధానకర్త....
శ్రీమతి జ్ఞానప్రసూన మేడం గారికి,
ప్రత్యేక శుభాభినందనలు.
చక్కని సంయోజకత్వంతో, మధురంగా పద్యాలను గానం చేస్తూ ,అవధానాన్ని రంజింపజేసారు.
 చాలా సంతోషం.🙏🏻💐🌹👏👌🏻
పద్మ చిగురాల..


ఈనాటి అవధానం నిర్వహించిన శ్రీమతి చూక్కాయ పల్లి శ్రీదేవి గారికి శుభాభినందనలు..వారు మరెన్నో అవధానాలు నిర్వర్తించాలని కోరుతున్నాను..అలాగే మంచి గళం..ధారణ గల్గిన శ్రీమతి ప్రసూన చక్కగా సమన్వయం చేశారు..వారికి కూడా అభినందనలు.. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి ధన్య వాదములు 💐💐💐
లక్ష్మీ మదన్, హైదరాబాదు

నా అంశం కు మంచి పద్యం తో పూరణ గావించిన మహిళా అవధాని గారు శ్రీదేవి గారికి అభినందను వందనములు  🙏 నాకు మహిళా అవధానం లో పాల్గొనే అవకాశం ఇచ్చిన నిర్వహకులు గోగులపాటి గారికి , సంధాన కర్తగా వ్యవహరించిన ప్రసూన గారికి నమస్కారములు 🙏 అవధానం లో అన్ని అంశాల పూరణలు చాలా చక్కగా పూరించారు మరొక్క సారి నమస్కారములు ,ధన్యవాదములు 🙏🙏
దృశ్య శ్రవణ మహిళా అవధానం లో నేను పాల్గొనటం మొదటిసారి  నాకు చాలా సంతోషాన్ని కలిగించింది గోగుల పాటి గారికి ప్రత్యేక అభివందనములు 🙏
సింగీతం సంధ్యారాణి

 అవధానులు చుక్కాయిపల్లి శ్రీదేవిగారు :మహిళామణీ ;అనిపించుకున్నారు అన్ని అవధాన ప్రక్రియలను అలవోకగా అర్థవంతంగా సారూప్యముగా పూరించారు
ఆ సరస్వతి కటాక్షవీక్షణాలు సదా మీపై ఉండాలని కోరుకుంటున్నాను
ఇందులో నేనూ భాగస్వామ్యం పొందినందులకు ధన్యురాలనూ
మహిళలకి ఇలాంటి మంచి కార్యక్రమం కల్పించిన క్రిష్ణమోహన్ గారికి క్రుతజ్ఞతాంజలులు .ప్రసూనగారి సమన్వయం ముదావహం
మహిళలందరికి గర్వకారణం
సదా సాహిత్యాభిలాషి
ముదిగొండ మణిమాల 
భాషోపాధ్యాయిని  వర్గల్

: చక్కని పదములపొందిక
మక్కువకలిగించు భావమాధుర్యమ్మున్ !
చుక్కాయి పల్లి అక్కయ
యక్కజమనిపించెమీదుయవధానంబే!
చాలా బాగాచేసారు . అభినందనలు  👍🌸👏😊మీ
ముత్యంపేట గాయత్రీదేవి , నాచారం హైద్రాబాద్


ఈ ఉదయం అద్భుతమైన దృశ్యశ్రవణానంద‌దాయకమైన మహిళావధానం చూస్తూ విని ఆనందించడం తో ఆరంభమైంది.
క్రూర కరోనా ఎంతో మహమ్మారి ఐనా కావలసినంత తీరిక నిచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు వీక్షించే యోగాన్ని కలిగించింది. దృశ్య శ్రవణ మాధ్యమాన్ని ఇలా మన సనాతన సాంప్రదాయిక సాహిత్య కళకు కూడా ఇంత అందంగా వినియోగించుకోవచ్చునని నిరూపించిన మాన్య మిత్రులు శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఎందరెందరో అవధానులకు మంచి అవకాశాలు ఇప్పించి వారి అంతర్గత ప్రతిభను బహిర్గతపరిచే గొప్ప పనికి పూనుకున్నారు. మీ పూనిక గొప్పది.
ఇక ఇవాళ నేను విన్న మహిళావధానం ఒక్క మాటలో చెప్పాలంటే రమణీయం.
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీ దేవి గారి పద్యాలు ఉత్తరోత్తరగరీయసిగా ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు అర్ధవంతమైన ఛందస్సుందరమైన సమాధానాలు చెప్పారు. ప్రతి పద్యం ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అన్నీ సమతూకంలో సరళ సుందరంగా ఉన్నాయి. వారికి హార్దికాభివందనములు.
ఇక శ్రీమతి జ్ఞాన ప్రసూన శర్మగారి నిర్వహణ ఆద్యంతం హృద్యంగా సాగింది.
మహిళలు ఎంతో నేర్పుగా, కుదురుగా, నిష్ఠతో ,సేవాభావంతో ఏపనినైనా నిర్వహించగలరని ఈ అవధానం నిరూపించింది. ప్రాశ్నకురాళ్ళు ప్రశ్నలను సమర్ధంగా సంధించారు. శ్రీ రాముడు సీత పాదాలకు లత్తుక నద్దినప్పడు శూర్పణఖ మనోభావాలను అడగడం, జంబూకంబున కక్కగావలె సుమా...వంటి సమస్యనివ్వడం వంటి మంచి ప్రశ్నలు వచ్చాయి. అష్ట లక్ష్ములు
అడిగిన అన్ని ప్రశ్నలకు దీటైనసమాధానాలు వచ్చాయి. 
మనదగ్గర మహిళావధానులు లేరు అనే కొరతను తీరుస్తోంది ఈ అవధానం. ప్రాశ్నికుల్లోంచికూడా అవధానులు వచ్చే అవకాశం ఉంది. ముందుగా జ్ఞాన ప్రసూన శర్మగారితో అవధానం చేయించవచ్చు. కృష్ణ మోహన్ గారూ ఆలోచించండి.
అభినందనలతో...
         మరుమాముల దత్తాత్రేయ శర్మ


మహిళామణుల వధానము 
సుహితప్రదమై శుభమ్ము సూచించెను  భూ 
రుహములు వారలు నిజముగ 
సహనమునను సాహితీ విశారదఫణితిన్ 
.....దోరవేటి

ఈ అవధానం యూట్యూబ్ లో వీక్షించుటకై
https://youtu.be/a3Q-FY7AE_w

స్వస్తి
మీ 
గోగులపాటి కృష్ణమోహన్

Wednesday, April 29, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 10

దృశ్య శ్రవణ అష్టావధానము - 10

స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-పంచమి
మంగళవారం, తేది 28-04-2020

అవధానవర్యులు 
శ్రీ బండకాడి అంజయ్యగౌడ్ గారు

సంయోజకులు:
శ్రీ దోరవేటి గారు

నిర్వహణ :
శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*
౧) సమస్య - శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు
౨) దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు
౩) వర్ణన - శ్రీ సింగీతం నరసింహారావు గారు
౪) ఆశువు - శ్రీ వడిచర్ల సత్యం గారు
౫) దృశ్యము - శ్రీమతి స్వర్ణలత గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ రామకృష్ణ రాజు గారు
౮) అప్రస్తుతం - శ్రీ కృష్ణా గౌడ్ గారు
*దృశ్యశ్రవణ అష్టావధానం*

అవధాని  ప్రార్ధనలు

సరస్వతి ప్రార్థన

శ్రీ వాణీ యలివేణీ
భావజు శతకోటిరూప ప్రార్థింతు మదిన్
రావమ్మా నను కావగ
దేవీ బ్రహ్మాణ్డ జనని తేజోమూర్తీ

గణపతి ప్రార్థన

శ్రీ గిరిజా వరనందన
భోగీంద్ర విభూష సకల బుధజన పోషా
యోగీంద్ర వరద శుభకర
రాగదె నను బ్రోవగాను రమ్య గణేశా


సమస్య - శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు


సమస్య:-
అవధానమ్ములు పెక్కులైన జనులత్యంతమ్ము భీతిల్లిరే

అవధాని పూరణ
చవులూరింపవు పద్యరా జము లు సత్సాంగత్యమున్ దోచదో
కవనంబెంతయు మంచిలక్షణ ములున్ కానంగరావచ్చటన్
స్తవనీయంబగు భారతార్తముల  సత్కావ్యంబులన్ జెప్పరీ
యవధానమ్ములు పెక్కులైన జనులత్యంతమ్ము భీతిల్లిరే



దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు

*నిర్వాహకులు మాన్యశ్రీ గోగులపాటికృష్ణమోహన్ గారికి , సంయోజకులు మాన్యశ్రీ దోరవేటిచెన్నయ్యగారికి , అవధానవర్యులు మాన్యశ్రీ బండకాడిఅంజయ్యగౌడ్ గారికి , పృచ్ఛకవరేణ్యులందరికీ పేరుపేరునా నమస్కారములు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*👉నా పేరు కట్టరంజిత్ కుమార్*
*👉సిద్ధిపేటలో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను*
**దత్తపది.... రాజు , గాజు , మోజు , బూజు పై పదాలను ఉపయోగిస్తూ "అవధానవిద్య" ను  ఉత్పలమాల వృత్తములో  నేను వర్ణించమని ఇవ్వగా అవధానవరేణ్యులు బండకాడిఅంజయ్యగౌడు గారు  కడురమణీయముగా ,  అత్యంతద్భుతంగా వర్ణించారు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

అవధాని పూరణ
*ఉ.*
*రాజులనాటి కాలమును రాజిలినట్టివధానవిద్యపై*
*మోజులు తీరెనంచు ముదమొందుచు బల్కిరి యెందరెందరో*
*గాజిది గాదటంచు యుగకర్తలుగాయవధాను లందరున్*
*బూజును దుల్పుచుండ్రి ఘనపూజ్యత గాంచవధానమిప్పుడున్!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏


వర్ణన - శ్రీ సింగీతం నరసింహారావు గారు

వర్ణన
దృశ్యశ్రవణ ఆన్లైన్ 10వఅష్టావధానాన్ని నిర్వహిస్తున్న గోగులపాటి కృష్ణమోహన్ గారు నిర్వహిస్తూచేస్తున్న సాహితీ సేవ సంతోషదాయకమైనది.

నాపేరు సింగీతం నర్సింహారావు.
అంశం:-వర్ణన
వేటకై అడవికి వెళ్ళిన పరీక్షిన్మహారాజు దాహంతో ఒక ముని ఆశ్రమునకువెళ్ళగా అక్కడ తపస్సుచేస్తున్న ముని తనను పట్టించుకోవటంలేదని రాజు కోపంతో అక్కడే చచ్చిపడియున్న సర్పమును ఆ ముని తలపై వేసివెళ్ళిపోగా...ఆమునికుమారుడు వచ్చి అదిచూసిఆగ్రహంతో శపిస్తాడు...
ఆ శపించే  సందర్భాన్ని వర్ణిస్తు స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పగలరు

అవధాని పూరణ
వర్ణన:-పద్యం -కందం.
ననుగానటు గర్వముచే
మునివర్యుడటంచురాజు మూర్ఖపు బుద్ధిన్
ఫణిశవమును మెడవేయగ
మునితనయుడు శాపమొసగె ముక్కోపముతోన్!


ఆశువు - శ్రీ వడిచర్ల సత్యం గారు

అవధాని గారికి,  నమస్కారం!
నా పేరు వడిచర్ల సత్యం
నేటి ఈ దృశ్య శ్రవణ అష్టావధానంలో నాయొక్క అంశం *ఆశుకవితకు సంబంధించిన ప్రశ్న.*
"కరోనా వలన మానవులకు అనేకమైన బాధలు, కష్టాలు, నష్టాలు సంభవించాయి కదా!?
అలాగే *మానవుల వలన కూడా కరోనాకు కలిగిన  బాధలు, కష్టాలు, నష్టాలు గురించి స్వేచ్చా పద్యంలో చెప్పాలని కోరుతున్నాను.*"!?
ఆశువు

అవధాని పూరణ
తే. గీ.
బయట దిరుగరు నాయొక్క భయము చేత
ముట్టు కోరెవరైనను ముప్పటంచు
ఎటుల జీవింతు నిప్పుడు ఏమిజేతు
ననుచు భీతి జెందె కరోన మననటంచు !
అష్టావధాని
బండకాడి అంజయ్య

దృశ్యము - శ్రీమతి స్వర్ణలత గారు

అంశం  దృశ్యం
అవధాని గారికి నమస్కారములు 🙏🏻
నా పేరు కొండపాక స్వర్ణలత.
నివాసం రామాయంపేట.
ఈ రోజు నా  అంశం  దృశ్యం *గురువు గొప్పదనమును*
ఈ చిత్రాన్ని చూసి స్వేచ్ఛా ఛందం లో  భావయుక్తమైన పద్యమును అందించగలరని కోరుచున్నాను.
ధన్యవాదములు 🙏🏻

అవధాని పూరణ
దృశ్యము పూరణ
అజ్ఙానము తొలగించియు
విజ్ఙానము కలుగజేసి విధ్యార్ధులకున్
సుజ్ఙానముకలిగించెడి
ప్రజ్ఙావంతుండుగురువు బ్రహ్మాండములో


న్యస్తాక్షరి - శ్రీ రామకృష్ణ రాజు గారు

న్యస్తాక్షరి
అక్షరాలు ని-ర-త-ము ...🙏
దృశ్యశ్రవణ అష్టావధానం -10    అవధాని శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ , సంయయోజకులు శ్రీ దోరవేటి చెన్నయ్య , నిర్వహాకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గార్ల కు నమస్సుమాంజలులు...

జె. రామకృష్ణరాజు తెలుగు భాషోపాధ్యాయులు (నిజాంపేట పాఠశాల ) న్యస్తాక్షరి లో భాగంగా ...

ప్రవరుడు హిమాలయాలను చూసి ఆశ్చర్యపోయినట్లు కరోన భారతదేశాన్ని చూసి ఆశ్చర్య పోతుంది అన్న ఇతివృత్తంతో చంపకమాల వకత్తంలో నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు ని-ర-త-ము ...తో పూరించగలరు🙏


న్యస్తాక్షరి
అవధాని పూరణ
చం౹౹
నిలువగ చోటులేదునిక నిక్కము నిక్కము నేడు నాకు వీ/
రలు బహు బుద్దిమంతులిట రాజిలబోనిక నాదు పూర విం/
తలు ఇకయేమి సేతునని తానెట బోవగ చోటు లేదహో/
ములుగుచు బిక్కుబిక్కుమని పోవగ దారిని జూడజొచ్చెనే..


అంత్యాద్యక్షరి - శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు


దృశ్య ,శ్రవణ అష్టావధానం-10
పేరు:వరుకోలు లక్ష్మయ్య
అవధాని:
బండకాడి అంజయ్య గౌడు
సంయోజకులు:
దోరవేటి గారు
నిర్వహణ:
గోగులపాటి కృష్ణ మోహన్ గారు
వరుకోలు లక్ష్మయ్య
తెలుగు భాషోపాధ్యాయులు
ZPHS గుర్రాలగొంది
జిల్లా సిద్దిపేట
చరవాణి:9704865816
తేది:28-04-2020

అంశం:
అంత్యాద్యక్షరి
పోతన భాగవతం నుండి పద్యం
ఉ:
నల్లని వాడు,పద్మ నయనంబుల వాడు, మహా శుగంబులన్
విల్లును దాల్చువాడు,గడు విప్పగు వక్షము వాడు, మేలుపై
జల్లెడి వాడు,నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులం
జల్లెడి వాడునైన, రఘు సత్తముడీవుత మా కభీష్టముల్

అవధాని పూరణ
కం.
లోకేశ్వరుడైన హరిని
ప్రాకటముగ దలచు వారి పాపములెల్లన్
చీకాకగు సత్యమిదియె
శ్రీ కమలాక్షుని స్మరించ సిరులొన గూడున్!
అవధాని గారి పూరణ

అవధాని ప్రశంసలు

సంచాలకులు దోరవేటిగారు

 సీ...
ఎవ్వాని పదపద్యమింపుగ జవులూర
జేయు సత్కవులను క్షితితలంబు
నెవ్వాని కవనంబు నిక్షు ఖండములౌచు
రసరమ్య జిహ్వపై రాగమగును
నెవ్వాని యవధాన మెల్ల పృశ్ఛ కులను
తికమక బెట్టించు ప్రకటితముగ
యెవ్వాని కథలలో యింగి తంబును కల్గి
సుజనుగా జేయును కుజను నైన

తే.గీ
అతడె దోరవేటి యను మహా కవీంద్రు
డతడు శారదా సుతునిగ యందమైన
బుఱ్ఱకథ గేయ కావ్యముల్  పొలుపుమీర
వ్రాసి నవలలు శతకముల్ వ్యాసములను
వాసికెక్కెను " అభినవ" దాశరథిగ.
అట్టి మహనీయునకు నేను నంజలిడుదు


కృష్ణ మోహన్

గోగులపాటి వంశ్యజుడు కూరి మి సత్కవితావిధుండు స
ద్బాగవతుండు శ్రేష్టుడు విధాత కులోద్భవుడార్య మిత్రుడున్
రాగములేనివాడు రసరమ్యు డు సౌమ్యుడు కీర్తి వంతుడు
న్నీగతి దృశ్యమందునను నేర్పు గ కూర్చెవధాన సత్క్రియన్
స్వాగతమిచ్చి యందరము  సన్నుతి జేతము కృష్ణమోహను న్


అభినందనలు
అష్టావధాని శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానం పై పద్యాభినందనలు_

_*గైని శ్రీనివాస్ గౌడ్*_
_అవధాని పద్య ధారలు_
_శ్రవణానందముగ సాగె లౌక్యపు రీతై_
_చివురాకులు దొడిగెనులే_
_కవితా కాంతారమందు గమనించంగన్_
                ..................... _*శ్రీ*_.
తక్కువ జదివిన నేమగు ?_
_పెక్కగు పద్యముల కలిమి బిరబిర సాగన్_
_మక్కువ గల్గెను మాకది_
_పెక్కురి యభినందనమ్ము విలువను బెంచున్_
            ......................... _*శ్రీ*_  ✍

అవధాని అవుసుల భానుప్రకాశ్: 
చదివిందారట! శబ్దశక్తి వరలెన్ సత్సాహితీ శిల్పమై,
మదులన్ మీటెను! దివ్యధార లొలుకన్ మాహాత్మ్యమౌ పద్యమౌ!
పదవిన్ జూడగ నామ మాత్రమదియే! పాండిత్యమెట్లబ్బెనో?
గద యంచున్ ఘనుడంజనార్యునకిదే కైమోడ్పులర్పించెదన్!!

చెన్నయ దోరవేటి ! పద చిత్రపు కాంతులవాటి! ధారలో
నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడు మేటి! గాత్రమా,
క్రొన్నెలదేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ
చెన్నయకేరి సాటి ధర? చెల్వగు వందనమందుకొమ్మికన్!

అవధాని ఐతగోని వెంకటేశ్వర్లు:
అంజన దీక్షాంజనమున
సంజనితానందపూర్ణ సారవధానం
బంజలి ఘటింప కవులా
యంజన సుతు కృపనుచేదు వభివందనముల్ 🙏
🙏🙏🙏🙏🙏🙏


దోరవేటి:
పూరణలో వేగమ్మును
ధారణలో నిష్ఠయును ముదావహమయ్యెన్
కారణజన్ములు మీరని
శ్రీ రమ్యాంజయ నుతింతు చిత్తము మెరయన్!
[28/04, 9:50 PM] Poet Doraveti దోరవేటి: అంజయావధాని కంజలి ఘటియించి
పృచ్ఛకాళికెల్ల ప్రేమ పంచి
అనుజు కృష్ణ మోహనుని మైత్రి దీవించి
నతులొనర్తు సుజన తతులకెల్ల!!!

వరుకోలు లక్ష్మయ్య
దృశ్య శ్రవణ అష్టావధానం-10 గోగులపాటి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించవడం జరిగింది. అవధాని బండకాడి అంజయ్య గౌడ్ గారు ఆద్యంతం ప్రా‌శ్నికులు అడిగిన  ప్రశ్నలకు సరియైనటువంటి సమాధానాలు చెప్పారు. సంయోజకులుగా శ్రీ దోరవేటి గారు వ్యవహరించారు.ఇంకా అంజన్న గారు అనేక అవధానాలు చేసి గొప్పగా ఎదగాలని అమ్మ వారిని ప్రార్థిస్తున్నాను.

పద్యం
కం.
అవధాన్యుడు అంజయ్య యె
అవిరతముగజేయుచుండె యవధానములన్
నవతర కవులకు కవనము
చవినే చూపించసాగె సవినయముగతాన్!



మణిపూసలు వడిచర్ల సత్యం:
నిన్న దిగ్విజయంగా జరిగిన, జరిపించిన దృశ్య శ్రవణ అవధానంలో పాలుగొనడం నా అదృష్టంగా భావిస్తూ......
అందుకు కారకులైన *దోరవేటి*  గారికి....

*మణిపూసలు*


తమ్ముడంటు నన్ను పిలిచి
మంచి చెడ్డ లన్ని గొలిచి
దోరవేటి అ(చె) న్నయ్య
నిలిపె నన్ను కవిగ మలిచి!!

*నిర్వాహకులకు*......

గోగుల పాటి కృష్ణ
మోహన్ సుకవి తృష్ణ
తీరినట్లు అవధానం
జరుపగదియె జ్యోత్స్న!!


*అంజన్నకూడ నన్నెప్పుడూ తమ్ముడూ అంటూ*...

సాహిత్యమె నందనం
పరిమళాల చందనం
అవధాని బండకాడి
అంజయ్యకు వందనం!!

*పృచ్చకులకు......*

వరకవులకు వందనం
పృచ్చకులకు వందనం
అవధానం గ(వి)న్నట్టి
సారసులకు వందనం!!

💐💐💐💐👏👏

మీ
*వడిచర్ల సత్యం*


అందరికీ కవితాంజలి
అవధాని బండకాడి అంజయ్య గారు
సోదర కవులెల్లరు స
మ్మోదముతో పద్యతతిని బొగడగ నాకా
హ్లాదము గలిగెను నిజముగ
యీధరణిని నాదుజన్మమే తరియించెన్


స్వస్తి

యూ ట్యూబ్ లింకు కొరకు

https://youtu.be/uX0nhaGtLrk

మీ
గోగులపాటి కృష్ణమోహన్

Monday, April 27, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 9 (జంటావధానమ్)

*దృశ్య శ్రవణ అష్టావధానము - 9*

స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-తదియ
 ఆదివారం, తేది 26-04-2020

*జంటావధానమ్*

జంటావధానవర్యులు : 

బ్రహ్మశ్రీ డాll ముదిగొండ అమరనాథశర్మ గారు
బ్రహ్మశ్రీ డాll ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు

సంయోజకులు: 

బ్రహ్మశ్రీ డాll అయాచితం నటేశ్వరశర్మ గారు


నిర్వహణ : 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*

౧) సమస్య - శ్రీ గొల్లపల్లి రఘురామశర్మ గారు
౨) దత్తపది - శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు
౩) వర్ణన - శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు
౪) పద్యానువాదం - శ్రీమతి జ్ఙానప్రసూన గారు
౫) దృశ్యము -  శ్రీ కాసుల శ్యాంసుందర్ గారు
౬) అంత్యాద్యక్షరి -  శ్రీ సతీష్ కుమార్ గారు
౭) అశువు - శ్రీ ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు
౮) శ్లోకానువాదం - శ్రీ శ్రీ శేషం వేణుగోపాల శర్మ గారు

సంయోజకుల ప్రశంస

జంటావధానుల ప్రార్ధన
జంట అవధానుల ప్రార్థన 🙏🏻
 సీ:."మంజీర నాదాల మంత్రమై మ్రోగగా
బ్రతుకు నేర్పెను మాకు మెతుకు సీమ 
సంస్కృతాంధ్రమ్ములన్ శాస్త్రాలతో పాటు
విద్దెనేర్పెను మాకు వేములాడ
అవధాన విద్యలో ఆనందమందించి
ఆస్వాద్య యోగ్యమై యలరునటుల
చిన్మయమూర్తియౌ"శ్రీహరి శర్మ"యే
సాహిత్యమును నేర్పె చతురమతిన"

 "ప్రథిత దృశ్యావధాన  సత్  ప్రాభవమున
జంటయష్టావధానమ్ము సలుపగాను
వచ్చినారము దీవింప వలయు నయ్య
పేర్మి హితులార! మతులార! పెద్దలార"

సమస్య - శ్రీ గొల్లపల్లి రఘురామశర్మ గారు

🙏🙏🙏🌹🌹🙏🙏🙏

బ్రహ్మ శ్రీ||
ముత్యంపేట గౌరీశంకర శర్మ
మరియు
బ్రహ్మ శ్రీ|| ముదిగొండ అమరనాథ శర్మ గార్ల
జంటావధానము
౼౼౼౼౼౼౼©©©©౼౼౼౼౼౼
*గొల్లపల్లి రఘురామశర్మ* గారి
*సమస్య*:
"హనుమత్పుత్రుడు భీష్మసూనను వివాహంబాడె రారండహో..."
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
అవధానుల పూరణ

*వినుమా నేడిట వాసుదేవకథలావిష్కారమున్ జేసెదన్*
*ఘనవంశాబుధినోలలాడిన మహాగాంభీర్య తేజస్వియౌ*
*అనుమానింపకుమయ్య కృష్ణుడతడేయాశ్చర్యమౌ దివ్యదే*
*హనుమత్పుత్రుడు భీష్మసూనను వివాహంబాడె రారండహో..*

🙏🙏🙏🌹🌹🙏🙏🙏

దత్తపది - శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు


అయ్యా అవధానులు బ్రహ్మశ్రీ డాక్టర్ ముదిగొండ అమరనాథశర్మా, బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మా గారలకు నమస్కారములు.

సంయోజకులు గురువులు డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మాగారు, నిర్వాహకులు గోగులపాటి కృష్ణ మోహన్ గార్లకు వందనములు.

నాపేరు మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా.

ఈ రోజు నా అంశం దత్త పది,
అహల్యా, సీతా, తారా, మండోదరి ఈ పదాలతోని భారతార్థంలో స్వేచ్ఛా ఛందస్సులో పద్యం చెప్పగలరని సవినయవిన్నపము.
*
యుగళావధానుల సుందరమైన పూరణ
*తేటగీతి*
సహజ సౌందర్య సముపేత సన్నుతాంగి
ఆయహల్యను సీతను యధిగమించి
తార,మండోదరీ స్త్రీల దాట వేసి
అందమున వెల్గుసైరంధ్రి
సుందరాంగి అందుకొనుమిదె నాచేయి హాయిగాను

వర్ణన - శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు

నమస్కారం
ఈరోజు దృశ్య శ్రవణ అవధానం లో వర్ణనాంశంగా

కైలాస పర్వతం పై ఆనంద తాండవ మాడే శివుడిలాస్యాన్ని  ఇచ్ఛా వృత్తంలో వర్ణించ ప్రార్థన

దృశ్యము -  శ్రీ కాసుల శ్యాంసుందర్ గారు


దృశ్య శ్రవణ అష్టావధానం-9
పృచ్చకులు:-కాసుల శ్యామసుందరశర్మ.
అంశం:దృశ్యం

అవధానుల పూరణ:-
యోగాభ్యాసంచ యేనిత్యమ్
విధివచ్చ ముదాన్వితాః !
తేకుర్వన్తి నరాస్సమ్యక్
ప్రాప్నువన్తి సుఖానిచ !!

పద్యానువాదం - శ్రీమతి జ్ఙానప్రసూన గారు

పద్యపూరణ
జ్ఙానప్రసూన

అవధానుల పూరణ:-
మాంధాత్రాది నరేష వందిత పదాంమాన్యామ్ సుసాధ్వీ వివాం
గంగా సింధు పయస్వనీంచ సతతం  సంపత్ ప్రదామ్ సౌఖ్యదాం
శ్రీమత్ భారతమాతరం చ గృహిణీ  శ్రీకాళికా  సైస్తుతాం
వందేతాం కరుణాలయాం నవవధూ ఆమోదమోదాన్వితాం

అశువు - శ్రీ ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు


జంటావధానులకు నమస్కారం,
నాపేరు:యం .మల్లికార్జున శర్మ
అంశం:ఆశువు
"సనాతన భారతీయ వైదిక సంస్కృతి విశిష్టత" పై ఆశువుగా ఏదైన వృత్తం లో పద్యం.

అవధానుల పూరణ:-
"యాత్త్యయ్యంత విచార సార లసితా  యావిశ్వసాహిత్యదా
యా వాల్మీకి కవీంద్ర వాంగ్మయ మహా కావ్య ప్రభా భాసురా
యా నాదామృత తత్వ  చింతన పరాయోగైక రాగాన్వితా
సా జీయాత్ వర నాట్యశాస్త్ర నిపుణా శ్రీభారతోర్వీసదా!!

అంత్యాద్యక్షరి -  శ్రీ సతీష్ కుమార్ గారు


శ్లోకానువాదం - శ్రీ శ్రీ శేషం వేణుగోపాల శర్మ గారు
అవధానులకు నమస్కారం
నేను శేషం. వేణుగోపాల శర్మ
కరీంనగరం తెలుగు పండితుడి ని
అయ్యా ఈ దృశ్యశ్లవణ అవధానంలో పృచ్ఛకుడిగా నా అంశం శ్లోకానికి పద్యానువాదం
స్వేచ్చాఛందం
శ్లో.
శ్రోత్రంశ్రుతేనైవ నకుండలేన
దానేనపాణిర్నతు కంకణేన
విభాతికాయః కరుణాపరాణా మ్
పరోపకారేన నచందనేన


అభినందనలు

ఇందరు సుకవులు మిత్రులు
యిందరుసాహిత్యబంధులిందరురసికుల్ !
డెందంబు విచ్చిమమ్మభి -
నందించిన యందరికివినమ్రనమస్సుల్!!👏👏🌸😊🌺

సరస్వతీ స్వరూపులు , అవధానవర్యులు శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారికి
శ్రీ ముదిగొండ అమరనాథ శర్మగారికి
 నమస్కారాలు🙏🙏🙏
 జంట అవధానం గూర్చి వినడమే కానీ చూడలేదు.ఎప్పటికైనా చూడాలనే కోరిక ఉండేది. ఈరోజు జంట అవధానం. అనగానే  నాకు అవకాశం ఈయమని అడిగి తీసుకున్నాను.
   చాలా అద్భుతంగా ఉంది అనే మాట చాలదేమో.  ప్రతీ అంశాన్ని శ్రద్ధగా విన్నాను .చాలా చాలా సంతోషంగా ఉంది.
 ఒకేచోట శివకేశవులను చూసినట్లుంది. ఇద్దరూ కలిసి అవలీలగా చేస్తుంటే . పాల్గొనే అవకాశం రావడం నా. సుకృతం.
గోగులపాటి కృష్ణమోహన్ గారికి. ధన్యవాదాలు.

కం.
****
శివకేశవ రూపంబున
యవధానులు తమరిరువురు నద్భుత రీతిన్
అవధానంబును జేయగ
సవినయముగ వందనాలు సల్పుదు మీకున్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కం
అవధాన ప్రాంగణంబున
యవధానుల కంజలించి యా నందముతో
కవితాశక్తికి జయమగు
యవధానపుజంట కిడును యావాణి కృపా.
వేణుగోపాల శర్మ శేషం

కం
తెలుగున నీయవధానము
చిలుకును తేనియపుపద్య
          చినుకుచు ఘనమౌ
పలికెడు కీరము లట్టుల
నిలిచిరి యవధానయుగళి నీర
    జ తేజుల్.
వేణుగోపాల శర్మ శేషం

మ.కో.
మీరుజేసెడు యీవధానము మిక్కుటంబగు మోదమై
పేరుగాంచును తెన్గుసాహితి ప్రీతినొందెడు పద్దెముల్
ధారణంబది వాసికెక్కగ ధార పద్యపు వాహినిన్
చేరియున్నటి పండితాళికి చే తులెత్తుచు మ్రొక్కగా
భారతీమణి దీవెనాళిగ ప్రస్తు తించుచు నెంచెదన్.
వేణుగోపాల శర్మ శేషం


అవధానమ్మునుగొప్పగాసలిపిరీయారాధ్యసౌందర్యమున్!!
- మాడుగుల నారాయణ శర్మ

ఈ అవధానము యూట్యూబ్ లో చూడటానికి ఈ క్రింది లింకు ఉపయోగించండి..

https://youtu.be/PfRtYQUuFQQ

మీ
గోగులపాటి కృష్ణమోహన్

Sunday, April 26, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 8

దృశ్య శ్రవణ అష్టావధానము - 8

స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-తదియ
 ఆదివారం, తేది 26-04-2020

యువావధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు

సంయోజకులు: 
శ్రీ డాll మాడుగుల భాస్కర శర్మ గారు

నిర్వహణ : 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*

౧) సమస్య - శ్రీ కంది శంకరయ్య గారు
౨) దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు

౩) వర్ణన - శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు
౪) ఆశువు - శ్రీమతి వేలేటి శైలజ గారు
౫) దృశ్యము - శ్రీ ఉండ్రాళ్ళ రాజేశం గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ కళ్ళే నరసింహం గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ దోరవేటి గారు
౮) అప్రస్తుతం - శ్రీ విట్టుబాబు గారు



ప్రార్థన పద్యాలు 

లోకాలోకములందు నిర్గుణుడ దుర్లోక్యుండవై కర్తవై 
నీకార్యంబులెరుంగఁజేయుటకునై నీమూర్తి నీవేదగన్ 
ప్రాకామ్యంబుగ సృష్టిఁజేసికొను లీలా సచ్చిదానందమౌ 
సాకారాంచిత విగ్రహుండవగు కృష్ణా! యద్వితీయా!నతుల్ 

కం: 
శివ మాధవ రూపంబులు 
ఛవి మించగనెడమకుడి భుజంబుల ద్వారన్ 
సువిధానము సృష్టించిన 
ప్రవిమల బ్రహ్మంబ నతులు రాధా లోలా

నిర్వాహకులు శ్రీగోగులపాటి కృష్ణ మోహన్ గారిపై 

తనరుచు పద్యమన్ననవధానమటన్నను యోగసాగరం 
బని కొనకొంచుసాగుచునునద్భుత సాహితి జీవయానమం 
దనయము సంచరించగల నార్యుడు గోగులపాటి కృష్ణ మో 
హనుఁగొనియాడి నేనిచట హాయిగఁజేదు వధానమింపునన్


పృచ్ఛక ప్రశంస 

1) కందిశంకరయ్య గారి పై 
మానకుండగను సమస్యరోజొకటిచ్చి 
శంకరాభరణము శంకలేక 
పద్యకవులచేత పద్యాలు వ్రాయించు 
కందిశంకరునకు వందనశతి 

2) దోరవేటి గారిపై 
దోరవేటి వేటినయిన తుష్టి గ్రహించి 
దోరమావుల పద్యాలనూరఁజేయు 
కవన ధర్మవేత్త యకవికార్యఛేత్త 
యైన పూర్వావధానికినంజలింతు 

3) ఈ వధానమందునింపుగా పాల్గొన్న 
యితర పృచ్ఛకాలి కిత్తునతులు 
సరస ప్రశ్నములను సాగగా వినువార 
లూగగా వధానముండుగాక

సంచాలకప్రశంస 
శాశ్వత కీర్తికన్యకను సాహితి యంచు గ్రహించి పుట్టి కా 
ళేశ్వరమున్ పురస్కృతులనెన్నియొ యందు కవీశు నేడుయో 
గీశ్వర లీలతోచనెడు నీయవధానపు చాలకుండగా 
నీశ్వర లీలనయ్యె నతులిచ్చెద భాస్కర శర్మ గారికిన్


సమస్య - శ్రీ కంది శంకరయ్య గారు

సమస్య

పర్వత పక్షముల్ దునిమె పన్నగభూషణుడుగ్రరూపుడై

సమస్యాపూరణము
సర్వము ఖర్వమై చనెను సంస్కృతి దివ్య పురాణగాథలున్
నేర్వరు నేర్పినన్ సరియె నేర్చెదరెప్పుడు సెల్లుచూడగా
పర్వమటంచు నొక్కడును బాలకుడీవిధినుత్తరంబిడెన్
పర్వత పక్షముల్ దునిమె పన్నగభూషణుడుగ్రరూపుడై


దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు



*దత్తపది.... శూలము , బాణము , ఖడ్గము , ఢమరుకము పదాలను ఉపయోగిస్తూ అమ్మవారి వైభవమును  స్వేచ్ఛాఛందస్సులో  నేను వర్ణించమని ఇవ్వగా అవధానవరేణ్యులు ఐతగోనివేంకటేశ్వర్లు వారు శార్దూలవృత్తములో కడురమణీయముగా ,  అత్యంతద్భుతంగా వర్ణించారు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

అవధాని పూరణ
*శా.*
*లీలన్ మూడుగుణాలఁద్రుంచెదననన్ ద్రిప్పున్ త్రిశూలమ్మునే*
*ఓలిన్ వేగముగాను బ్రోతుననగా ఓహోహొ బాణంబుచేన్*
*కేళిన్ ఆరగు శత్రులన్ దునుమగా కేల్గొంచు ఖడ్గమ్ముచే*
*నాలోకించ జయంబుకై ఢమరుకంబాదేవి తాదాల్చెడున్!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

*మీ కట్టరంజిత్ కుమార్*


వర్ణన - శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు

_*నేటి దృశ్య,శ్రవణ అష్టావధానంలో "మహాభారతంలోని ఉత్తర గోగ్రహణం ఘట్టంలో బృహన్నల అర్జునునిగా  తెలిసిపోయాడో అట్లాగే  విద్య  , ప్రతిభా పాటవాలు అట్లాగే బయట పడ్డాయి అని వర్ణించిన అవధాని శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారు , పృచ్ఛకుడు శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు*_

అవధాని పూరణ
_మత్తకోకిల_

_దాగదెప్పుడు దాచియుంచిన ధన్యమౌ బ్రతిభన్ గనన్_
_వేగమప్పుడు దా బృహన్నల వేషముండిన పార్థుడున్_
_ఆగకుండగ జీల్చివేయడె ? యంత నా కురు సేనలన్_
_ఈ గతిన్ బ్రతిభా రహిల్లును నెప్పుడైనను లోకమున్_
...................... _*శ్రీ*_. ✍

ఆశువు - శ్రీమతి వేలేటి శైలజ గారు

ఆశువు
అవధానిగారికి నమస్కారం ___నాపేరు వేలేటి శైలజ సిద్దిపేట🌸 ఈనాటి నా అంశం _🍀ఆశువు🍀,,,,,,,,,,,"నేటి అక్షయ తృతియ రోజున కరోనా ప్రభావంతో మూతబడిన బంగారపు దుకాణాల యజమానుల మానసిక స్థితిని వర్ణిస్తూ స్వేచ్చా ఛందములో చెప్పగలరు"

అవధాని పూరణ
అక్షయమైన లాభములునందక పోయెను నేడుదేవ మా
లక్షలు కోట్టు ఇప్పుడును రాణనుగోల్పడి యేడబోయెనో
శిక్ష విధించితేమిటయ శ్రీహరి రక్షణు జేయుమింక నిన్
లక్షణమున్ నుతించెదము లావుగ బాపు కరోనదేవరా

దృశ్యము - శ్రీ ఉండ్రాళ్ళ రాజేశం గారు

పేరు ఉండ్రాళ్ళ రాజేశం, 
సిద్దిపేట

అంశం : దృశ్యము

దృశ్యము
వేములవాడ దేవస్థానం ముందర రెండు కోడేలు  భక్తుల కోసం ఎదురు చూస్తున్న దృశ్యం పై కంద పద్యములో తెలియజేయగలరు


అవధాని పూరణ
మేమేమి పాపమెపుడో 
స్వామీ!మరిచేసినామొ చక్కకమమ్మున్ 
నీమముతో నీకీయగ 
వేముల వాడను గుడియిక వే మూసిరొకో

అంత్యాద్యక్షరి - శ్రీ కళ్ళే నరసింహం గారు

*"దృశ్యశ్రవణ అష్టావధానం"* స్రష్ట,నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారికీ, సంయోజకులు శ్రీ మాడుగుల భాస్కరశర్మ గారికీ, అవధానవర్యులు శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారికీ, పృచ్ఛక మహోదయులకూ నా ప్రణామములు.
నా పేరు *కళ్ళే నరసింహం*, నేను అనంతపురములో ఆంగ్లోపన్యాసకునిగా పనిచేస్తున్నాను.
ఈనాటి దృశ్యశ్రవణ అష్టావధానంలో నా అంశం : అంత్యాద్యక్షరి.
అవధరించండి.
*మ్రొక్కెద నరుణగిరీశా*
*మ్రొక్కెదనయ వేగగావ మునిజనవంద్యా!*
*మ్రొక్కెద జ్ఞానము నీయగ*
*మ్రొక్కెదనయ మోక్షమిడగ ముక్కంటీశా!*
ధన్యవాదములు.
🙏🌹🙏
అవధానివర్యులు అంత్యాద్యక్షరి పై చేసిన శ్రీమహావిష్ణు ప్రార్థన—
అవధాని పూరణ

శాంతాకారుడుశౌరిసర్వమయుడైసర్వేశుడైలోకముల్
స్వాంతమ్మందునయోగనిద్రముననిత్యాలోకముం జేయుచున్
చెంతన్ జేరుచుసిద్ధభక్త వరులన్ శీఘ్రంబు రక్షించు నే
నెం తేనాతనిసన్నుతింతునిలలోతృష్ణల్ ఫలింపంగనే!
ధన్యవాదములు.
🙏🌹🙏


న్యస్తాక్షరి - శ్రీ దోరవేటి గారు


దోరవేటి- హైదరాబాద్... న్యస్తాక్షరి 
అ-వ- ధా- నం- ఈ అక్షరాలను  ఆద్యక్షరాలుగా ఉపయోగిస్తూ...
రైతు జీవితం నేపథ్యం గా ఇష్టమైన ఛందంలో  పద్యం చెప్పండి...

న్యస్తాక్షరి.....
అవధాని పూరణ
అత్తల్ కోడలు నెల్లవారు త్వరగా నా క్షేత్రమున్ జేరుచున్ 
వత్తాసై సహకారమీయ ప్రకృతిన్ వందించి పూజించి బా 
ధాత్తంబైనను నన్నమీయ ప్రజకై తామున్ పనిన్ జేయరే 
నత్తల్ వోలెను జీవయాన మకటా! నష్టంబుగా సాగినన్

అప్రస్తుతం - శ్రీ విట్టుబాబు గారు
నా అప్రస్తుత ప్రశ్నలకు అవధాని గారి సమాధానాలు:

*అప్రస్తుతము ప్రశ్న 1*
అవధాని గారూ.. అవధానము అంటే అక్షరములతో ఆడే ఆట కదా! మరి క్షరములతో కూడా ఆడే ఆట ఏమైనా ఉందంటారా.. ఉంటే అది ఏమై ఉంటుంది.?

*అవధాని గారి సమాధానం:*
ఆర్యా! అక్షరములతో ఆడే క్రీడ అవధానమయితే, క్షరములతో ఆడే క్రీడ బ్రతుకు. ఎందుకంటే ఈ జీవితంలో ఏ సుఖము గానీ, వయసే గానీ రోజురోజుకూ క్షీణించిపోతున్నది. క్షరమైపోతున్నది.

*అప్రస్తుతం ప్రశ్న 2*
అవధానిగారూ! పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఇప్పుడు లేవు. ఒకవేళ ఇప్పుడు కూడా పర్వతాలకు రెక్కలుంటే ఏమయ్యుండేది?

*అవధానిగారి సమాధానము*
ఆర్యా! ఇప్పుడూ పర్వతాలకి రెక్కలున్నాయండి.. ఇక్కడ పర్వతాలంటే భౌతికమైన కోర్కెలు. అవి రెక్కలు దాల్చి ప్రపంచమంతా సంచరిస్తూండడం వలన జీవి జననమరణచక్రంలో కొట్టుకుపోతూంటే... ఇంద్రరూపంలో ఉన్న పరమాత్ముడు ఆ రెక్కలను నరికివేస్తాడని మనం అర్థం చేసికోవాలి. ఎందుకుంటే వేదాలలో ఇంద్రుడు కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పారు. మనం మోహమనే పర్వతానికి ఉన్న రెక్కలను తప్పకుండా నరికేసుకోవాలి.

*అప్రస్తుతము ప్రశ్న 3*
అవధానిగారూ.. శూలము, ఖడ్గము, బాణము లాంటి పదాలతో పూరణము చేస్తున్నారు కదా! మీకు నిజ జీవితంలో ఇలాంటి ఆయుధాల ప్రయోగంలో అనుభవం ఉన్నదా?

*అవధాని గారి సమాధానం:*
ఆర్యా! నేను వాటిని తాత్వికమైన భావనలతో పూరించాను చూడండి. శూలంతో అమ్మవారు త్రిగుణాలను ఛేదిస్తుందని, బాణం వేగంగా పోతుంది కాబట్టి అమ్మవారు వేగంగా రక్షిస్తుందని, ఖడ్గంతో మనలోపల ఉన్న షడ్వర్గాలను ఛేదిస్తుందనీ,  ఢమరుకం జయానికని... మనజీవితమనే అవధానంలో, బాణం వలె వేగమైన ఆశువు, శూలం వలె పద్యం చెప్పునపుడు త్రిగుణాలకు అతీతంగా చెప్పడం, ఖడ్గం వలె ధారణ తప్పించే అంశాలను ఖండించడం, ఢమరుకం వలె విజయాలను అందుకోవడం చేస్తాను.

ధన్యవాదాలు
🙏🏻🙏🏻


అభినందనలు
_అవధాని గారిపై ప్రశంసా పద్యాలు_
_*గైని శ్రీనివాస్ గౌడ్*_
_*సిద్ధిపేట*_
_మత్తకోకిల పద్యమందున మత్తగొల్పెడి భావమై_
_యెత్తుకున్నది స్వేచ్ఛ ఛందము నిమ్ము గూర్చెను వర్ణనై_
_మెత్తనైనది వర్ణ శబ్దము మెండు హర్హము గూర్చెనే_
_చిత్తమందున నిల్చి పోవునె స్ఫీతమైనటు వర్ణముల్_
_వర్ణన జేయంగను నా_
_కర్ణమ్ముల నాలకించ గైసేసిన నా_
_వర్ణమ్ముల శబ్దము సం_
_పూర్ణంబై పద్యమెల్ల మోదము గూర్చెన్_
   ....................... _*శ్రీ*_. ✍
చక్కని అష్టావధాన కార్యక్రమం మొదటిసారి నేను పాల్గోనడానికి అవకాశం కల్పించిన గోగులపాటి కృషమోహన్ గారికి, అవధాని వెంకటేశ్వర్లు గారికి సంయోజకులు పృచ్చకులకు ధన్యవాదాలు .. భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశీస్తూ ....🙏🙏🙏
ఉండ్రాళ్ళ రాజేశం, సిద్దిపేట

తెలుగు తేనె రసము తీపిదనమ్ముతో
ఐతగోని పద్యమవతరించె
ధారయున్ ధారణ తాదాత్మ్యతను చెంది
వెలువడెనా నోట విస్తృతముగ
పృచ్ఛకులందరునిచ్ఛాను సారము
యడిగిన ప్రశ్నల నద్భుతముగ
వివరించె గొప్పగా విధివిధానములోన
పద్యకేళీరత్న ప్రాభవముగ
ధన్యులందరు,అవధాన తత్వమందు
కృష్ణమోహన పథదర్శ
క్రీడ యిదియె
సరస సాహిత్య సాఫల్య సంబరమ్ము
ధన్యవాదములందరు
మాన్యులకును.
.....డా.మాడుగుల భాస్కర శర్మ

అవధాని మనోగతం
ఆవృత్తులనుగల్గునవధానమదిగల్గు 
బైటి సభలయందు బాగుగాను 
ఇచ్చటనొకమారె యిచ్చిన యంశంబు 
పద్యంబు సెప్పిన బాధలేక
చివరగనన్నిటిన్ శీఘ్రధారణచేసి 
పూర్తి చేయగ మదిపొంగెనేడు 
నమ్మకమ్మదిగల్గెనిమ్ముగా నేనింక 
శత వధానమయిన సల్పెదనని 

తే.గీ
ఇచట పృచ్ఛకవర్యులు ఇంపుతోడ 
ప్రశ్నలడిగిన మీకునే లాలితముగ 
వందనందన చందనాలందఁజేదు 
ముదము గొనుడింక మీమది పొంగగాను


ఇట్టి అవధానం యూట్యూబ్ లో వీక్షించుటకై... 
https://youtu.be/VkGmn95-r50

స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్