Friday, May 1, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 11 (మహిళా అవధానము)

దృశ్య శ్రవణ అష్టావధానము - 11
(మహిళా అవధానము)
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంతఋతువు , వైశాఖ మాసం, శుద్ద సప్తమి
గురువారం, తేది 30-04-2020

మహిళా అవధాని : 

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు


సంయోజకులు: 

*శ్రీమతి జ్ఙానప్రసూన గారు*


నిర్వహణ : 

*శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు*

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకురాళ్ళు*

౧) సమస్య - శ్రీమతి పద్మ చిగురాల గారు
౨) దత్తపది - శ్రీమతి ముత్యంపేట గాయత్రీ దేవి గారు
౩) వర్ణన - శ్రీమతి లక్ష్మీ పద్మజ గారు
౪) ఆశువు - శ్రీమతి స్వర్ణలత గారు
౫) దృశ్యము - శ్రీమతి లక్ష్మీ మదన్ గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీమతి హారిణాపవన్ గారు
౭) న్యస్తాక్షరి - శ్రీమతి ముదిగొండ మణిమాల గారు
౮) నిషేధాక్షరి - శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు

అవధాని ప్రార్ధన

నిను సేవింపగ నిత్యము
ఘనమౌ సంతృప్తి కలిగె కరుణాభరణా
కనుచూపులలోనీవై
మనుమా నాతలపులోన మహితప్రకాశా

సమస్య - శ్రీమతి పద్మ చిగురాల గారు


అవధాని గారికి నమస్సులు.
అంశం..సమస్య
జంబూకంబునకక్క  గావలె సుమా ! శ్వానంబు శార్దూలముల్.

ధన్యవాదాలు.🙏🏻
పద్మ చిగురాల...

సమస్యాపూరణము...
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు.

క్రమాలంకారములో
శా.
సంబంధంబులు గానకన్ కుటిలతన్ స్వార్థంబునే జూపినన్
సంబంధీకులన్న ప్రేమనిరతిన్ విశ్వాసమున్ జూపుగా
అంబాయన్నను జాలిలేక తినుగానాసక్తితో దూడలన్
జంబూకంబునకక్క  గావలె సుమా ! శ్వానంబు శార్దూలముల్.



దత్తపది - శ్రీమతి ముత్యంపేట గాయత్రీ దేవి గారు


నాపేరు:- ముత్యంపేట గాయత్రీదేవి
అంశం :-దత్తపది
పదాలు:- నేర్పు .కూర్పు. మార్పు. చేర్పు
ఈపదాలతో ప్రస్తుత పరిస్థితులలో గృహిణి జీవనాన్ని వర్ణించండి
మీ స్వేచ్ఛావృత్తంలో

దత్తపది పూరణ :-
నేర్పునుచూపుచున్ మహిళనిండుమనమ్మునజేయుకృత్యముల్
కూర్పునొసంగుబంధములు కోమలమై రవళింపప్రేమతోన్
మార్పులనేసహించిబహుమానములేకయెతృప్తిజెందుచున్
చేర్పులకైన సిద్ధపడుసేవలొసంగును భృత్యురాలిగన్ !

వర్ణన - శ్రీమతి దుగ్గరాజు లక్ష్మీ పద్మజ గారు


సభకు నమస్కారం
నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
ఈనాటి అవధాన కార్యక్రమం లో నా అంశం వర్ణన

శ్రీ రాముడు సీతాదేవి పాదాలకు లత్తుక రాస్తున్నప్పుడు చెట్టు చాటు నుండీ చూసిన సూర్పణఖ మనసులోని భావావేశం గురించి వర్ణించవలసినదిగా అవధాని గారిని కోరుకుంటున్నాను,,  ధన్యవాదములు
లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
హైదరాబాద్

వర్ణన పూరణ

కోమలి లేత పాదములకు నునుపత్ర శోభకూర్చగా
రాముడు చేతదాల్చె రసరమ్యములై మురిపించు లత్తుకన్....
ఆ మది పుష్పసోయగం హాయినింపుచు నద్దె మెత్తగన్
నా మది బ్రద్దలయ్యే గదా నాకది ఎంతటి క్షోభ గూర్చెగా
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఆశువు - శ్రీమతి స్వర్ణలత గారు


అవధానిగారికి నమస్కారములు.
పేరు :కొండపాక స్వర్ణలత.
అంశం : ఆశువు.
గృహిణిగా, వృత్తిపరంగా స్త్రీ యొక్క స్వేచ్ఛ, బాధల పరంపరను పద్యరూపములో అందించుమని కోరడం జరిగినది 🙏🏻

*అవధాని గారి పురణ*
గృహిణిగ బహు బాద్యతలన్
అహరహము  శ్రమించి కూర్చునానందమునన్
సహనము చూపును వృత్తిన
తుహినము వలె కరుగు మనసు దుఃఖములందున్.


దృశ్యము - శ్రీమతి లక్ష్మీ మదన్ గారు

అవధాని గారికి నమస్కారం
నా పేరు లక్ష్మీ మదన్, హైదరాబాదు.

నాకిచ్చిన అంశం దృశ్యం..

నేను ఇచ్చిన పై దృశ్యం
మృగశిర కార్తె లో తొలకరి జల్లు పడగానే రైతులు నాగళ్లని బాగు చేయించుకుని వ్యవసాయం కొస సిద్ధం అవుతాడు..దీనిని మీరు ఉత్పలమాల లో చెప్పగలరు.

ధన్య వాదములు🙏
సంయోజకులు శ్రీమతి ప్రసూన గారికి అభినందనలు

నేటి అవధాన కార్యక్రమం లో శ్రీమతి లక్ష్మీ మదన్ గారు అడిగిన  అంశం " దృశ్యం " గురించి నేటి అవధాని గారు  శ్రీమతి శ్రీదేవి గారు ఇచ్చిన పూరణ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మల్లెలు జల్లులై కురిసె మాధురి నింపెను వర్ష ధారలే
కొల్లలు కాగా రైతు మదికూర్చెను సంతసముల్ విహారమై !
మెల్లగ దాల్చె నాగలిని మెండగ నుచ్చు గతాస్రవంతిలో
చల్లగ విత్తనంబులను చక్కని పంటలు రూపుదిద్దగన్
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


అంత్యాద్యక్షరి - శ్రీమతి హారిణాపవన్ గారు

అవధాని గారికి నమస్కారములు.
పేరు:కొరిడె హరిణాపవన్
అంశం:అంత్యాదక్షరి
మొల్ల రామాయణంలోని
రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్
నకారంతో ముగిసింది..

అవధాని గారిపూరణ పద్యం..
నటనలు నయవంచనముల్
జటిలములై జీవితమున సంకటములన్
మటుమాయమవును క్షీమము
కుటిలములను మానుకొనిణ కూరునుయశముల్

న్యస్తాక్షరి: శ్రీమతి ముదిగొండ మణిమాల గారు

అవధానిగారికి నమస్కారములు .
పేరు : ముదిగొండ మణిమాల
అంశం : న్యస్తాక్షరి
చంపకమాల వ్రుత్తములో ప్రతి పాదమునందలి ఆద్యక్షరములు "మ. గు ,వ , లు '' అని వచ్చేలా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ పద్యపూరణ చేయగలరని మనవిచేయగా చక్కని ఆణిముత్యాన్ని ఇలా అందించారు
💐💐💐💐💐💐💐💐💐
న్యస్తాక్షరి పూరణ

"మరుపుకురాని సేవలివి మానిని నిత్యము నొనర్చు క్రుత్యముల్
గురువుగ విద్యలన్ గరుపు కూర్చు యశంబుమందునన్
వరుస జయంబులన్ గనగ ఫక్కున నవ్వుచు ప్రోత్సహించు మే
లు రతనములట్లు పల్కు బహులుప్త మగున్ విసుగుల్ విరామముల్ '
💐💐💐💐💐💐💐💐💐



నిషేధాక్షరి - శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు

అవధానిగారికి నమస్కారములు
పేరు: సింగీతం సంధ్యా రాణి
అంశం: నిషిద్దాక్షరి
శ బ అనే అక్షరాలను నిషేధిస్తూ శిబి చక్రవర్తి ప్రాశస్త్యము ను స్వేచ్ఛా వృత్తము లో చెప్పగలరని మనవి🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అవధాని గారి పూరణ

పక్షిని కాపాడంగా
నక్షయముగ త్యాగధనుడ నాయాసముగన్
రక్షణకు మాంసము నొసగెన్
చక్షువులే చిమ్మరిల్లె సాహస భృతితో

అభినందనలు

అవధాని గారి అభినందనలు
ముగింపు

చక్కని అంశము లొసగిరి
అక్కలు చెల్లెళ్ళుగాను నవధానమునన్
తక్కువ గామిక మీమని

మక్కువగా నేడు సభకు మహరాణులుగన్
చుక్కాయపల్లి శ్రీదేవి

అభినందనలు
💐💐💐💐💐

అవధాని గారికి
*************
కం.

చుక్కాయపల్లి వారలు
చక్కని పద్యాల చేత సభనలరించన్
దిక్కులనిండ గ మీ ప్రభ
అక్కా! శ్రీ దేవి మీకునంజలులివియే

కృష్ణమోహన్ గారికి
***************
తే.గీ.
*****

కృష్ణ మోహను లీరీతి తృష్ణ తోడ
సాహి తీసేవ జేయుచు సదమలముగ
చదువులమ్మను మెప్పించి సంతసమున
ధన్య తనుగొనె చూడనీ ధరణిలోన

పృచ్ఛకులకు
***********
కం.
****
మహిళా యవధానమ్మిట
మహిళలె పృచ్ఛకులుగాను మాన్యత నొప్పన్
మహిలో నెన్నడు జూడని
మహదానందమును గొలిపె మంగళ కరమై

💐💐💐💐💐💐💐💐💐
జ్ఞానప్రసూనాశర్మ ఎల్లికంటి
కడ్తాల- రంగారెడ్డి జిల్లా


నేనిచ్చిన అంశానికి (ఆశువు ) మంచి పద్యం తో పూరణ గావించిన మహిళా అవధాని  శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి   అభినందన వందనములు🙏🙏
 అవధానం లోపాల్గొనే అవకాశం ఇచ్చిన
నిర్వహకులు శ్రీ  గోగులపాటి కృష్ణమోహన్ గారికి,   సమన్వయ కర్త శ్రీమతి  జ్ఞానప్రసూనా శర్మగారికి  గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు🙏
కొండపాక  స్వర్ణలత. 
రామాయంపేట.

 🌹🍀🌹
నా స్పందన.....శుభాభినందనల మాల.💐👏👌🏻🌹

చిక్కని కవితా ధారతొ                           
చక్కని యవధానియయ్యె  సభికుల  తోడన్                                          చుక్కా యని శ్రీదేవియు                         
చక్కటి పద్యంబు చెప్ప చతురత చూపెన్.

పాదము  పద్యము చెప్పుట           
కాదనకనె పూర్తిచేసె కర్ణామృతమై                                                    శ్రీదేవికి పద్యంబులు               
పూదండల నల్లినట్లు పొసగెను యిచటన్....

    పద్మ చిగురాల...🙏🏻🌹👏

 అనుసంధానకర్త....
శ్రీమతి జ్ఞానప్రసూన మేడం గారికి,
ప్రత్యేక శుభాభినందనలు.
చక్కని సంయోజకత్వంతో, మధురంగా పద్యాలను గానం చేస్తూ ,అవధానాన్ని రంజింపజేసారు.
 చాలా సంతోషం.🙏🏻💐🌹👏👌🏻
పద్మ చిగురాల..


ఈనాటి అవధానం నిర్వహించిన శ్రీమతి చూక్కాయ పల్లి శ్రీదేవి గారికి శుభాభినందనలు..వారు మరెన్నో అవధానాలు నిర్వర్తించాలని కోరుతున్నాను..అలాగే మంచి గళం..ధారణ గల్గిన శ్రీమతి ప్రసూన చక్కగా సమన్వయం చేశారు..వారికి కూడా అభినందనలు.. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి ధన్య వాదములు 💐💐💐
లక్ష్మీ మదన్, హైదరాబాదు

నా అంశం కు మంచి పద్యం తో పూరణ గావించిన మహిళా అవధాని గారు శ్రీదేవి గారికి అభినందను వందనములు  🙏 నాకు మహిళా అవధానం లో పాల్గొనే అవకాశం ఇచ్చిన నిర్వహకులు గోగులపాటి గారికి , సంధాన కర్తగా వ్యవహరించిన ప్రసూన గారికి నమస్కారములు 🙏 అవధానం లో అన్ని అంశాల పూరణలు చాలా చక్కగా పూరించారు మరొక్క సారి నమస్కారములు ,ధన్యవాదములు 🙏🙏
దృశ్య శ్రవణ మహిళా అవధానం లో నేను పాల్గొనటం మొదటిసారి  నాకు చాలా సంతోషాన్ని కలిగించింది గోగుల పాటి గారికి ప్రత్యేక అభివందనములు 🙏
సింగీతం సంధ్యారాణి

 అవధానులు చుక్కాయిపల్లి శ్రీదేవిగారు :మహిళామణీ ;అనిపించుకున్నారు అన్ని అవధాన ప్రక్రియలను అలవోకగా అర్థవంతంగా సారూప్యముగా పూరించారు
ఆ సరస్వతి కటాక్షవీక్షణాలు సదా మీపై ఉండాలని కోరుకుంటున్నాను
ఇందులో నేనూ భాగస్వామ్యం పొందినందులకు ధన్యురాలనూ
మహిళలకి ఇలాంటి మంచి కార్యక్రమం కల్పించిన క్రిష్ణమోహన్ గారికి క్రుతజ్ఞతాంజలులు .ప్రసూనగారి సమన్వయం ముదావహం
మహిళలందరికి గర్వకారణం
సదా సాహిత్యాభిలాషి
ముదిగొండ మణిమాల 
భాషోపాధ్యాయిని  వర్గల్

: చక్కని పదములపొందిక
మక్కువకలిగించు భావమాధుర్యమ్మున్ !
చుక్కాయి పల్లి అక్కయ
యక్కజమనిపించెమీదుయవధానంబే!
చాలా బాగాచేసారు . అభినందనలు  👍🌸👏😊మీ
ముత్యంపేట గాయత్రీదేవి , నాచారం హైద్రాబాద్


ఈ ఉదయం అద్భుతమైన దృశ్యశ్రవణానంద‌దాయకమైన మహిళావధానం చూస్తూ విని ఆనందించడం తో ఆరంభమైంది.
క్రూర కరోనా ఎంతో మహమ్మారి ఐనా కావలసినంత తీరిక నిచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు వీక్షించే యోగాన్ని కలిగించింది. దృశ్య శ్రవణ మాధ్యమాన్ని ఇలా మన సనాతన సాంప్రదాయిక సాహిత్య కళకు కూడా ఇంత అందంగా వినియోగించుకోవచ్చునని నిరూపించిన మాన్య మిత్రులు శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఎందరెందరో అవధానులకు మంచి అవకాశాలు ఇప్పించి వారి అంతర్గత ప్రతిభను బహిర్గతపరిచే గొప్ప పనికి పూనుకున్నారు. మీ పూనిక గొప్పది.
ఇక ఇవాళ నేను విన్న మహిళావధానం ఒక్క మాటలో చెప్పాలంటే రమణీయం.
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీ దేవి గారి పద్యాలు ఉత్తరోత్తరగరీయసిగా ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు అర్ధవంతమైన ఛందస్సుందరమైన సమాధానాలు చెప్పారు. ప్రతి పద్యం ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అన్నీ సమతూకంలో సరళ సుందరంగా ఉన్నాయి. వారికి హార్దికాభివందనములు.
ఇక శ్రీమతి జ్ఞాన ప్రసూన శర్మగారి నిర్వహణ ఆద్యంతం హృద్యంగా సాగింది.
మహిళలు ఎంతో నేర్పుగా, కుదురుగా, నిష్ఠతో ,సేవాభావంతో ఏపనినైనా నిర్వహించగలరని ఈ అవధానం నిరూపించింది. ప్రాశ్నకురాళ్ళు ప్రశ్నలను సమర్ధంగా సంధించారు. శ్రీ రాముడు సీత పాదాలకు లత్తుక నద్దినప్పడు శూర్పణఖ మనోభావాలను అడగడం, జంబూకంబున కక్కగావలె సుమా...వంటి సమస్యనివ్వడం వంటి మంచి ప్రశ్నలు వచ్చాయి. అష్ట లక్ష్ములు
అడిగిన అన్ని ప్రశ్నలకు దీటైనసమాధానాలు వచ్చాయి. 
మనదగ్గర మహిళావధానులు లేరు అనే కొరతను తీరుస్తోంది ఈ అవధానం. ప్రాశ్నికుల్లోంచికూడా అవధానులు వచ్చే అవకాశం ఉంది. ముందుగా జ్ఞాన ప్రసూన శర్మగారితో అవధానం చేయించవచ్చు. కృష్ణ మోహన్ గారూ ఆలోచించండి.
అభినందనలతో...
         మరుమాముల దత్తాత్రేయ శర్మ


మహిళామణుల వధానము 
సుహితప్రదమై శుభమ్ము సూచించెను  భూ 
రుహములు వారలు నిజముగ 
సహనమునను సాహితీ విశారదఫణితిన్ 
.....దోరవేటి

ఈ అవధానం యూట్యూబ్ లో వీక్షించుటకై
https://youtu.be/a3Q-FY7AE_w

స్వస్తి
మీ 
గోగులపాటి కృష్ణమోహన్

6 comments:

  1. అయ్యా మీ శ్రమ అనిర్వచనీయమైనది... అవధానినీమణుల, మహిళా పృచ్ఛకుల ఒకచోట సంయోజనం ప్రశంసనీయం. మీ సాహిత్య అవధాన పిపాసలకు జిజ్ఞాసకు అభినందనలు....

    ReplyDelete
  2. అద్భుతం గా వుంది కృష్ణ మోహన్ గారూ,, మీకు ఎలా అభినందనలు తెలపాలో మాటలు రావడం లేదు,, అద్భుతమైన కార్యక్రమం,, విన్నూత్నమైన పంథాలో మహిళల కోసం మహిళావధాని గారిచే అష్టావధానం కార్యక్రమం జరిపించడం అద్భుతమైన ప్రక్రియ , ఇంత క్లిష్టమైన లాక్ డౌన్ సమయంలో వివిధ దూర దూర ప్రాంతాల్లో వున్న మహిళలను సమన్వయపరిచి ఇంత విజయవంతంగా అష్టావధాన కార్యక్రమంని జరిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు,, ఈ కార్యక్రమం వెనుక వున్న మీ కృషికి,, శ్రమకు, శ్రద్ధకు ( మీరు నాకంటే వయసులో చిన్న వారైనా కూడా మీలోని గురువుకు శిరసానమామి 🌹🙏🌹
    మీకు హృదయ పూర్వక శుభాభినందనలు మరియు వేవేల కృతజ్ఞతలు
    దుగ్గరాజు లక్ష్మీ పద్మజ, హైదరాబాదు.

    ReplyDelete
  3. "ముంజేతి కంకణానికి అద్దమేల 'మహిళా అవధానం గూర్చి మీరు తీసుకున్న శ్రద్ధ గూర్చి తెలియజేయడానికి మాటలు చాలవు. మా హ్రుదయానందమే దానికి నిదర్శనం.
    "ముదితల్ నేర్వగరాని విద్యగలదే శ్రధ్ధార నేర్పించినన్ '
    మేము కొంచెం విలంబించినా
    మమ్మల్ని తొందరపెట్టి ఎంతో శ్రమకొర్చి ఈ మహిళావధానాన్ని
    పూర్తి చేసారు . అందుకు మీకు శతదా సహస్రదా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అవధాని మా గౌరిశంకర్ కి కూడా హ్రుదయపూర్వక
    ధన్యవాదములు 🙏🙏🙏🙏
    ముదిగొండ మణిమాల, హైదరాబాదు

    ReplyDelete
  4. మహిళా అష్టావధానం అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన కృష్ణమోహన్ గారు ఎంతో శ్రమకోర్చి వినూత్నమైన పద్ధతిలో దృశ్య శ్రవణ అవధానం చేయడానికి ప్రోత్సహించడం అభినందనీయం అరుదైన విషయం మహిళా మణులు అవని నుండి అంబరం వరకు సాహసంచేసి అబలలు గాదు సబలలం అని నిరూపించారు
    ✍️..మొగలిమాల

    ReplyDelete