Saturday, May 2, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 12

*దృశ్య శ్రవణ అష్టావధానము - 12*

స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంతఋతువు , వైశాఖ మాసం, శుద్ద నవమి
శనివారం, తేది 02-05-2020

అవధానవర్యులు

*శ్రీ దోరవేటి గారు*


సంయోజకులు: 

*శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు*

నిర్వహణ : 

*శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు*

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు* 

౧) సమస్య: శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
౨) దత్తపది: శ్రీమతి కోటంరాజు రమాదేవి గారు
౩) వర్ణన : శ్రీమతి ఉప్పల పద్మ గారు
౪) న్యస్తాక్షరి: శ్రీ మధుసూదన్ రావు గారు
౫) ఆశువు: శ్రీమతి మచ్చ అనురాధ గారు
౬) అప్రస్తుతం: శ్రీ సాగర్ల సత్తయ్య గారు
౭) దృశ్యం : శ్రీ పసుల హనుమంత్  గారు
౮) అంత్యాద్యక్షరి: శ్రీమతి పార్నంది లలితా కృష్ణమూర్తి గారు


సంయోజకుని ప్రశంస
*చెన్నయ దోరవేటి ! పద చిత్రపు కాంతులవాటి! ధారలో*
*నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడు మేటి! గాత్రమా,*
*క్రొన్నెలదేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ*
*చెన్నయకేరి సాటి ధర? చెల్వగు వందనమందుకొమ్మికన్!*

*తీయని పద్యధార, వెనుదీయని శాబ్దిక శిల్పమద్దియే!*
*హాయిగ సాగుతూగు, మనసంత వసంతము లొల్కునట్లు, 'నో*
*హో' యనిమెచ్చునట్లు, పరమోన్నత పద్యపు భాతిపంచె తా,*
*నా యన దోరవేటి! ఘనుడన్నగ నెన్నగ మేటివాడహో!!*
      -అవుసుల భానుప్రకాశ్.


అవధాని ప్రార్థన:
శివరూపంబగు తల్లి దండ్రులు గురుల్ శ్రీకార బృందారకుల్
కవనంబన్నది దివ్యగంగ సుకవుల్ గాంచంగ విఘ్నేశ్వరుల్
అవధానంబు సరస్వతీ చరణమౌ నర్చాత్మకుల్ పృచ్ఛకుల్
భువి నీరీతిగ దేవతాళి నెదలో పూజించి ప్రార్థించెదన్!

మేటికి గోగులపాటి  కి
రీటికి నవధాన నిత్య కృత్య సుకవితా
వాటికి మోహనకృష్ణ కు
మాటికి మాటికిని నతులు మాన్యచరితుకున్!

సారథి సాహితి సంఘము
సారథి యవధాని భాను సారథి యయ్యెన్
నే రథిగా నవధానము
సారసమున నడుపు మనుజ! సత్కవిరాజా!

పృచ్ఛకశ్రేష్ఠులార! సద్విబుధులార!
ప్రశ్న లడుగుడి వాగ్దేవి భవ్యమైన
దీవెనలుగ పద్యముల నందింతు నేను
మేటి పద్యార్చకులు మేలు మేలనంగ...



౧) సమస్య: శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు

సమస్య
దృశ్యశ్రవణ అష్టావధాన నిర్వాహకులు శ్రీగోగులపాటి కృష్ణ మోహన్ గారికి, ఈనాటి అవధానసంచాలకులు శ్రీఅవుసుల భానుప్రకాశ్ అష్టావధాని గారికి..అదేవిధముగా నేడు అష్టావధానము చేస్తున్న అష్టావధాని శ్రీదోరవేటిగారికి నమస్సులతో....
ఇస్తున్న సమస్య.....
*పాపముఁజూచి మెచ్చి భగవంతుడు భక్తినొసంగి గాచెడిన్*
ఐతగోని వేంకటేశ్వర్లు నల్లగొండ
అష్టావధాని
సమస్య
పాపముఁజూచి మెచ్చి భగవంతుడు భక్తినొసంగి గాచెడున్

అవధాని పూరణ
లోపములెన్నొ మీరగను లోకులు శోకమునందుమున్గి సం
తాపము మీర స్వార్థమున ధారుణినేరము లెన్నొచేయుచున్
గోపముతోడనొండొరులు కొట్టుకొనంగను నాపజూచు దీ
పా పముఁజూచి మెచ్చి భగవంతుడు భక్తినొసంగి గాచెడున్

దత్తపది: శ్రీమతి కోటంరాజు రమాదేవి గారు

డా" కోటంరాజు రమాదేవి.
అంశం: దత్తపది
విషయం: "కరోనా" మూలంగా బోసిపోయిన "తిరుమల" క్షేత్రం తిరిగి లక్షలాది భక్తులతో నిత్యకళ్యాణం,పచ్చతోరణంగా వెలుగొందాలని ఆశిస్తూ పద్యం చెప్పాలని అవధానిగారిని ప్రార్థిస్తున్నాను.🙏
 పదాలు: నయము
               రయము
               భయము
                జయము

అవధాని పూరణ
తే"గీ:  భయము వలదు కరోనా అనయముగాదు
రయముగా నేగు నదియు నిరయము జేర
మరల దీవించు వెంకన్న మమ్ము మిమ్ము
జయము లోకములోని సుజనుల కెల్ల.


వర్ణన : శ్రీమతి ఉప్పల పద్మ గారు

ముందుగా అవధాని శ్రీ దోరవేటి గారికి, సంయోజకులు శ్రీ అవుసుల భానుప్రకాశ్  గారికి,
నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి మరియు నా సహ పృఛ్ఛకులందరికీ హృదయపూర్వక నమస్సులు. 🙏🙏🙏
నా పేరు : ఉప్పల పద్మ
అంశం : వర్ణన
 హుస్సేన్ సాగర్ లో గణపతి విగ్రహ నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో శివ పార్వతుల మనోస్థితిని  స్వేచ్ఛా ఛందంలో  వర్ణించగలరు.
ధన్యవాదాలు. 🙏🙏

వర్ణన : హుస్సేన్ సాగర్ లో గణపతి విగ్రహ నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో శివ పార్వతుల మనోస్థితిని స్వేచ్ఛా ఛందములో వర్ణించగలరు.

అవధాని గారి వర్ణన :-

వర్ణన:
"హిమసుత నీదు నందనుని యింపుగ గంగను ముంచు " "మేల?" "తా
నముకయి" చేసె సాగరము నం" "దది వైతరణీనదీ సమా
నముగద!" "ముగ్ధభక్తిని గనంగను వాసన యేల గల్గు నో
శమదమ రూప! " యన్న విని శంభుడు నవ్వెను హాయి హాయిగా !

దృశ్యం : శ్రీ పసుల హనుమంత్  గారు

నా పేరు పసుల హనుమంత్,
వికారాబాద్ జిల్లా.

దృశ్య,శ్రవణ అవధానానికి నమస్కారం🙏
నాకు అవకాశం కల్పించిన
నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష మోహన్ గారికి,
బహుముఖ ప్రజ్ఞాశాలి, పూజ్య గురువులు ,
అవధాని శ్రీ దోరవేటి గారికి,
కార్యక్రమ సంయోజకులు అవుసుల భానుప్రకాశ్ గారికి మరియు పృచ్ఛకులకు నమస్కారం🙏

అవధాని గారిని నేనడిగే అంశం *దృశ్యం*..

ఈ దృశ్యానికి తగిన వర్ణన చేస్తూ పద్యాన్ని చెప్పవలసిందిగా అవధాని శ్రీ దోరవేటి గారిని ప్రార్థిస్తున్నాను.


అవధాని పూరణ
కూటికి గుడ్డకున్ వగచి కోర్కెలు గుండెలలోన దాచి స
య్యాటలు పాట లీతలు నిరంతర మాలను గాయు కృత్యముల్
చీటికి మాటికిన్ గురుల చేతను  పోలెల నారగింపులున్
నేటికి తీపి గుర్తులయు నిండె మనంబున దృశ్య రూపమై
ధన్యవాదాలు🙏

   
ఆశువు: శ్రీమతి మచ్చ అనురాధ గారు

మచ్చ.అనురాధ.
సిద్దిపేట.

నేనిచ్చిన 
అంశము : ఆశువు

హిరణ్యకశిపుడి భార్య   లీలావతి గర్భవతి గా నున్నప్పుడు  నారదమహర్షి విష్ణు భక్తి తత్వాన్ని
బోధిస్తున్న విధానమును  ఆశువుగా  పద్యం తెల్పండి .

ఆశువుగా  అవధాని గారు చెప్పిన పద్యం.

తేటగీతి.

ఆశువు:
సర్వతో వ్యాప్తియై యుండు నిర్వికారి
సర్వదా భక్తులను గాచు చక్రధారి
నమ్మి కొలిచెడివారి ననారతమ్ము
ప్రేమతోడుత రక్షించు విష్ణుమూర్తి !
👌👌💐💐🙏🙏🙏🙏


న్యస్తాక్షరి: శ్రీ మధుసూదన్ రావు గారు

నా పేరు కడియాల మధుసూదనరావు, 
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడిని.
అవధాన సభాసరస్వతికి అభివందనాలు. ఈ రోజు  దృశ్యశ్రవణ అష్టావధానం చేయబోతున్న శ్రీ దోరవేటి కవి గారికి, నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారికి, పృచ్ఛక పండితులకు నా నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు.
నాకు ఇచ్చిన అంశం న్యస్తాక్షరి.
తెలంగాణ అనే పదంలో
తె అక్షరం 1వపాదం మొదటిఅక్షరంగా,
లం అక్షరం రెండో పాదం మూడవ అక్షరంగా,
గా అక్షరం మూడో పాదం నాల్గవ అక్షరంగా,
ణ అక్షరం నాల్గవ పాదం ఐదవ అక్షరంగా ప్రయోగిస్తూ భారతంలోని భీష్ముని కథ ఒక మత్తేభం లో వర్ణించండి


*అవధాని పూరణ*
తెలిసెన్ తండ్రి విచార కారణము బుద్ధిన్ యోచనన్ జేయగా
కలలందైనను తండ్రి సౌఖ్యమునకున్ గాసేది గానీని ని
శ్చలు గంగాసుతు బ్రహ్మచర్యము ప్రతిజ్ఞన్ జేసి భీష్ముండుగా
నిలలో రాణకు నెక్కె దేవతలు దీవింపంగ హర్షంబునన్


అంత్యాద్యక్షరి: 
శ్రీమతి పార్నంది లలితా కృష్ణమూర్తి గారు

అవధాని గారికి నమస్కారం🙏
నా పేరు లలితాకృష్ణ 
నా అంశం 
అంత్యాద్యక్షరి 

రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా
రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావనవ్రతో 
ద్దాముడు రాముడే పరమ దైవము మాకని మీ యడుoగు కెం
దామరలే భజించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

అవధాని పూరణ

అంత్యాద్యక్షరి:
ధీరుడు మేఘస్వన గం
భీరుడు నసురాళి నణచు భీకరయోధుం
డారయ శ్రీ రఘురాముడు
శ్రీ రమ్యుడు మిమ్ము గాచు! చిరయశ మిచ్చున్!



అప్రస్తుతం: శ్రీ సాగర్ల సత్తయ్య గారు

సభా సరస్వతి వందన మందారాలు. నా పేరు సాగర్ల సత్తయ్య నల్లగొండ. తెలుగు భాషోపాధ్యాయుడను. నా అప్రస్తుత ప్రసంగం లో మొదటి ప్రశ్న
 అయ్యా అవధానిగారూ
పండితుండు అని మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు కదా పండితుండు అంటే ఎవరండీ
 తుండు వేసుకొని పండే వాడా?

అప్రస్తుతం ప్రశ్న 1
పండితుండు కానీ మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు కదా పండితుండు అంటే ఎవరండీ
 తుండు వేసుకొని పండే వాడా? 

 అవధాని సమాధానం
 పండితుండు అంటే పండిన అనుభవంతో దోషాలను తుంచేవాడు

 అప్రస్తుతం ప్రశ్న 2

అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అంటారు కదా మరి ప్రియురాలు అయితే ఏం చూస్తుంది అంటారు? 

 అవధాని సమాధానం
 ఆ ఏముంది.. తలను చూస్తుంది... ఇంకా ఎన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయా అని...

 అప్రస్తుతం ప్రశ్న 3
 అవధాని గారు గణపతి నిమజ్జనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే... కానీ పాపం బుద్ధుడు ప్రతిరోజు హుస్సేన్ సాగర్ లో నిలబడి ఉంటాడు కదా... అతని పరిస్థితి ఏమిటంటారు? 

 ఆయన తామరాకు మీద నీటి బొట్టు... లేదా కొలనులో తామరాకు...


అభినందనలు

దోరవేటి గారు,ఈ అవధానం మీ శేముషీవైభవానికెత్తిన వైజయంతిక.
జాతికి మరో అవధాన రత్నం దొరికాడన్న మాన్యశ్రీ మెట్టు రామశర్మ గారి మాట సార్థకమైనది.
ఆశీరభినందనలతో.. 
      ఎం.సాంబశివశర్మ. వికారాబాద్.


అవలీలగ నవధానము
 కవి లోకము మెచ్చు నటుల కమనీయంగా
చవులూరగ గావించిన 
అవధానీ  దోరవేటి  అభివందనముల్ 

                  - విధేయుడు
                 సాగర్ల సత్తయ్య
                   నల్లగొండ


వర్ణన విభాగంలో నేనిచ్చిన అంశానికి చక్కని పద్యంతో పూరణ గావించిన అవధాని శ్రీ దోరవేటి గారికి అభినందన వందనములు.  అనిర్వచనీయమైన వారి పాండిత్య ప్రతిభకు పాదాభివందనములు. 🙏🙏
   అవధానంలో పాల్గొనే అవకాశం కల్గించిన నిర్వాహకులు గోగులపాటి కృష్ణ మోహన్ గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు. మరియు 
సంయోజకులుగా బహు బాగా వ్యవహరించిన అవుసుల భాను ప్రకాశ్ గారికి నమస్సులతో  ధన్యవాదాలు.. 🙏🙏🙏
       - ఉప్పల పద్మ 
       నల్లగొండ జిల్లా.


ఇంకాసేపు ఉంటే బాగుండుననిపిస్తుంది...దృశ్య శ్రవణ అవధానం బ్రహ్మాండం💐💐..నిర్వాహకులకు,సంయోజకులకు,శ్రీ అవధాని గార్లకు నమస్కారం🙏
ధన్యవాదాలు🙏🙏

🌷 *ఆటవెలది*🌷

దోరవేటి గురుడు దొడ్డమనసుతోడ
నాదు బాల్య స్మృతుల నాకుజెప్పి
యిట్టి సంతసంబునెదయందు నింపిరి
వందనములుజేతునందుకొనుడి

🌷మణి పూసలు🌷

బహుముఖ ప్రజ్ఞాశాలి
తల్లివలె సహనశీలి
బహుకళల కాణాచి
కరుణా సద్గుణశీలి

పద్యరచన వీరుడు
కథా నవలకారుడు
దోరవేటి కళలలోన
సాటిలేని చతురుడు .
                                                       
మీ శిష్యుడు....
పసుల హనుమంత్,అక్కాపూర్

ఒకర కృష్ణమూర్తి, మరొకరు భానుమూర్తి, వారి నయన చతుష్కం పర్యవేక్షణలో అవధానం అమందానంద సుందరనందనం. ఇద్దరికీ నమోవాకాలు.

అంజయ్య గౌడ్, అష్టావధాని
అన్నయ్య దోరవేటిగారికి అభినందనలతో
కం..
హవనంబై యలరారెను
నవధానము దృశ్యశ్రవణ మాద్యంతబున్
అవధాని దోరవేటికి
ప్రవిమల మగు వందనమిడి బ్రస్తుతి జేతున్


తెలుగు వారి స్వంతమైన అవధానప్రక్రియను ఈ తరము వారికే కాక రాబోయే తరము వారికి తెలిసే విధముగా నిర్వహిస్తున్న గోగులపాటి కృష్ణమోహన్ గారికి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్థితప్రజ్ఙులు, అవధాని శ్రీ దోరవేటి గారికి, ఈ కార్యక్రమములో పాల్గొన్న ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు మీకు సమకాలీనుడిగా జన్మించడం నా అదృష్టము
సదా మీ అభిమాని
చల్లగాలి వెంకటరాజు

నేటి దృశ్య, శ్రవణ అష్టావధానంలో అవధానిగారు దోరవేటి గారికి అభినందనలతో

_"దోరవేటి" యన్న పూరణ ధారలై_
_జోరు నందు కునెడి పారు ధేన_
_కోరి యడగ పృచ్ఛ ధోరణికిని వారు_
_కూరుపరియె గాదె ? భూరి యగుచు_

                 ..................... _*శ్రీ*_. ✍


శ్రీ దోరవేటి గారి 
అవధానము లో 
 పాల్గొనె అవకాశం
కల్పించిన  శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ సార్ గారికీ ,
అలాగే ఈ కార్యక్రమ
సంయోజకులు అవుసుల భానుప్రకాశ్  సార్ గారికి
ధన్యవాదాలు.
మచ్చ.అనురాధ.
సిద్దపేట.
💐💐💐💐
🙏🙏🙏🙏🙏


ఐతగోని వెంకటేశ్వర్లు, అష్టావధాని
నేటి దృశ్యశ్రవణ అష్టావధానములో నేనిచ్చిన సమస్యకు చక్కటి రసవత్తర లలితపూరణగావించిన అవధాని శ్రీదోరవేటివారికి నమస్సులతో యభినందన పద్యమాల 

ఎండల్ మండగ దోరమావి రసమై యేపారుచున్ పారుచున్ 
నిండెంచెన్ మదులందు మోద ఝరులన్ నీరంధ్రమౌ ధారతోన్ 
బండెన్ బాకముతోసమస్య అవధానంబంత పూర్ణంబయెన్ 
దండాలిత్తును దోరవేటి యవధానార్యాసు దామమ్ముగాన్


అవుసుల భానుప్రకాశ్, అష్టావధాని
*చెన్నయ దోరవేటి ! పద చిత్రపు కాంతులవాటి! ధారలో*
*నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడు మేటి! గాత్రమా,*
*క్రొన్నెలదేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ*
*చెన్నయకేరి సాటి ధర? చెల్వగు వందనమందుకొమ్మికన్!*

*తీయని పద్యధార, వెనుదీయని శాబ్దిక శిల్పమద్దియే!*
*హాయిగ సాగుతూగు, మనసంత వసంతము లొల్కునట్లు, 'నో*
*హో' యనిమెచ్చునట్లు, పరమోన్నత పద్యపు భాతిపంచె తా,*
*నా యన దోరవేటి! ఘనుడన్నగ నెన్నగ మేటివాడహో!!*
      -అవుసుల భానుప్రకాశ్.


అవధాని ముగింపు పద్యాలు
అవధాన సారథి అవుసుల భానుకు 
         ముఖ్యుడయిన కృష్ణ మోహనునకు 
నేటి సమస్యకు మేటి వధానియౌ 
           వేంకటేశ్వర నామ విబుధవరుకు 
న్యస్తాక్షరి యిడిన నయగుణశీలురు 
             మధుసూదనునకు సమంచితముగ 
వర్ణన గోరిన పద్మకున్ భక్తితో 
             
              దత్తపదినిడిన ధరణి  రమకు 

ఆశు విచ్చిన అనురాధ అతిశయముకు 
రమ్యమంత్యాక్షరినిడు లలిత మతికి 
సరస మప్రస్తుత ప్రయోక్త సత్తయకును 
దృశ్య మిచ్చిన హనుమంతు ధీమతికిని 
వందనాశీస్సు లివె మీకు నందుకొనుడి!

యూ ట్యూబ్ లింక్ కోసం

https://youtu.be/impLDEbJOmo


స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్

Friday, May 1, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 11 (మహిళా అవధానము)

దృశ్య శ్రవణ అష్టావధానము - 11
(మహిళా అవధానము)
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంతఋతువు , వైశాఖ మాసం, శుద్ద సప్తమి
గురువారం, తేది 30-04-2020

మహిళా అవధాని : 

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు


సంయోజకులు: 

*శ్రీమతి జ్ఙానప్రసూన గారు*


నిర్వహణ : 

*శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు*

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకురాళ్ళు*

౧) సమస్య - శ్రీమతి పద్మ చిగురాల గారు
౨) దత్తపది - శ్రీమతి ముత్యంపేట గాయత్రీ దేవి గారు
౩) వర్ణన - శ్రీమతి లక్ష్మీ పద్మజ గారు
౪) ఆశువు - శ్రీమతి స్వర్ణలత గారు
౫) దృశ్యము - శ్రీమతి లక్ష్మీ మదన్ గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీమతి హారిణాపవన్ గారు
౭) న్యస్తాక్షరి - శ్రీమతి ముదిగొండ మణిమాల గారు
౮) నిషేధాక్షరి - శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు

అవధాని ప్రార్ధన

నిను సేవింపగ నిత్యము
ఘనమౌ సంతృప్తి కలిగె కరుణాభరణా
కనుచూపులలోనీవై
మనుమా నాతలపులోన మహితప్రకాశా

సమస్య - శ్రీమతి పద్మ చిగురాల గారు


అవధాని గారికి నమస్సులు.
అంశం..సమస్య
జంబూకంబునకక్క  గావలె సుమా ! శ్వానంబు శార్దూలముల్.

ధన్యవాదాలు.🙏🏻
పద్మ చిగురాల...

సమస్యాపూరణము...
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు.

క్రమాలంకారములో
శా.
సంబంధంబులు గానకన్ కుటిలతన్ స్వార్థంబునే జూపినన్
సంబంధీకులన్న ప్రేమనిరతిన్ విశ్వాసమున్ జూపుగా
అంబాయన్నను జాలిలేక తినుగానాసక్తితో దూడలన్
జంబూకంబునకక్క  గావలె సుమా ! శ్వానంబు శార్దూలముల్.



దత్తపది - శ్రీమతి ముత్యంపేట గాయత్రీ దేవి గారు


నాపేరు:- ముత్యంపేట గాయత్రీదేవి
అంశం :-దత్తపది
పదాలు:- నేర్పు .కూర్పు. మార్పు. చేర్పు
ఈపదాలతో ప్రస్తుత పరిస్థితులలో గృహిణి జీవనాన్ని వర్ణించండి
మీ స్వేచ్ఛావృత్తంలో

దత్తపది పూరణ :-
నేర్పునుచూపుచున్ మహిళనిండుమనమ్మునజేయుకృత్యముల్
కూర్పునొసంగుబంధములు కోమలమై రవళింపప్రేమతోన్
మార్పులనేసహించిబహుమానములేకయెతృప్తిజెందుచున్
చేర్పులకైన సిద్ధపడుసేవలొసంగును భృత్యురాలిగన్ !

వర్ణన - శ్రీమతి దుగ్గరాజు లక్ష్మీ పద్మజ గారు


సభకు నమస్కారం
నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
ఈనాటి అవధాన కార్యక్రమం లో నా అంశం వర్ణన

శ్రీ రాముడు సీతాదేవి పాదాలకు లత్తుక రాస్తున్నప్పుడు చెట్టు చాటు నుండీ చూసిన సూర్పణఖ మనసులోని భావావేశం గురించి వర్ణించవలసినదిగా అవధాని గారిని కోరుకుంటున్నాను,,  ధన్యవాదములు
లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
హైదరాబాద్

వర్ణన పూరణ

కోమలి లేత పాదములకు నునుపత్ర శోభకూర్చగా
రాముడు చేతదాల్చె రసరమ్యములై మురిపించు లత్తుకన్....
ఆ మది పుష్పసోయగం హాయినింపుచు నద్దె మెత్తగన్
నా మది బ్రద్దలయ్యే గదా నాకది ఎంతటి క్షోభ గూర్చెగా
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఆశువు - శ్రీమతి స్వర్ణలత గారు


అవధానిగారికి నమస్కారములు.
పేరు :కొండపాక స్వర్ణలత.
అంశం : ఆశువు.
గృహిణిగా, వృత్తిపరంగా స్త్రీ యొక్క స్వేచ్ఛ, బాధల పరంపరను పద్యరూపములో అందించుమని కోరడం జరిగినది 🙏🏻

*అవధాని గారి పురణ*
గృహిణిగ బహు బాద్యతలన్
అహరహము  శ్రమించి కూర్చునానందమునన్
సహనము చూపును వృత్తిన
తుహినము వలె కరుగు మనసు దుఃఖములందున్.


దృశ్యము - శ్రీమతి లక్ష్మీ మదన్ గారు

అవధాని గారికి నమస్కారం
నా పేరు లక్ష్మీ మదన్, హైదరాబాదు.

నాకిచ్చిన అంశం దృశ్యం..

నేను ఇచ్చిన పై దృశ్యం
మృగశిర కార్తె లో తొలకరి జల్లు పడగానే రైతులు నాగళ్లని బాగు చేయించుకుని వ్యవసాయం కొస సిద్ధం అవుతాడు..దీనిని మీరు ఉత్పలమాల లో చెప్పగలరు.

ధన్య వాదములు🙏
సంయోజకులు శ్రీమతి ప్రసూన గారికి అభినందనలు

నేటి అవధాన కార్యక్రమం లో శ్రీమతి లక్ష్మీ మదన్ గారు అడిగిన  అంశం " దృశ్యం " గురించి నేటి అవధాని గారు  శ్రీమతి శ్రీదేవి గారు ఇచ్చిన పూరణ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మల్లెలు జల్లులై కురిసె మాధురి నింపెను వర్ష ధారలే
కొల్లలు కాగా రైతు మదికూర్చెను సంతసముల్ విహారమై !
మెల్లగ దాల్చె నాగలిని మెండగ నుచ్చు గతాస్రవంతిలో
చల్లగ విత్తనంబులను చక్కని పంటలు రూపుదిద్దగన్
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


అంత్యాద్యక్షరి - శ్రీమతి హారిణాపవన్ గారు

అవధాని గారికి నమస్కారములు.
పేరు:కొరిడె హరిణాపవన్
అంశం:అంత్యాదక్షరి
మొల్ల రామాయణంలోని
రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్
నకారంతో ముగిసింది..

అవధాని గారిపూరణ పద్యం..
నటనలు నయవంచనముల్
జటిలములై జీవితమున సంకటములన్
మటుమాయమవును క్షీమము
కుటిలములను మానుకొనిణ కూరునుయశముల్

న్యస్తాక్షరి: శ్రీమతి ముదిగొండ మణిమాల గారు

అవధానిగారికి నమస్కారములు .
పేరు : ముదిగొండ మణిమాల
అంశం : న్యస్తాక్షరి
చంపకమాల వ్రుత్తములో ప్రతి పాదమునందలి ఆద్యక్షరములు "మ. గు ,వ , లు '' అని వచ్చేలా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ పద్యపూరణ చేయగలరని మనవిచేయగా చక్కని ఆణిముత్యాన్ని ఇలా అందించారు
💐💐💐💐💐💐💐💐💐
న్యస్తాక్షరి పూరణ

"మరుపుకురాని సేవలివి మానిని నిత్యము నొనర్చు క్రుత్యముల్
గురువుగ విద్యలన్ గరుపు కూర్చు యశంబుమందునన్
వరుస జయంబులన్ గనగ ఫక్కున నవ్వుచు ప్రోత్సహించు మే
లు రతనములట్లు పల్కు బహులుప్త మగున్ విసుగుల్ విరామముల్ '
💐💐💐💐💐💐💐💐💐



నిషేధాక్షరి - శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు

అవధానిగారికి నమస్కారములు
పేరు: సింగీతం సంధ్యా రాణి
అంశం: నిషిద్దాక్షరి
శ బ అనే అక్షరాలను నిషేధిస్తూ శిబి చక్రవర్తి ప్రాశస్త్యము ను స్వేచ్ఛా వృత్తము లో చెప్పగలరని మనవి🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అవధాని గారి పూరణ

పక్షిని కాపాడంగా
నక్షయముగ త్యాగధనుడ నాయాసముగన్
రక్షణకు మాంసము నొసగెన్
చక్షువులే చిమ్మరిల్లె సాహస భృతితో

అభినందనలు

అవధాని గారి అభినందనలు
ముగింపు

చక్కని అంశము లొసగిరి
అక్కలు చెల్లెళ్ళుగాను నవధానమునన్
తక్కువ గామిక మీమని

మక్కువగా నేడు సభకు మహరాణులుగన్
చుక్కాయపల్లి శ్రీదేవి

అభినందనలు
💐💐💐💐💐

అవధాని గారికి
*************
కం.

చుక్కాయపల్లి వారలు
చక్కని పద్యాల చేత సభనలరించన్
దిక్కులనిండ గ మీ ప్రభ
అక్కా! శ్రీ దేవి మీకునంజలులివియే

కృష్ణమోహన్ గారికి
***************
తే.గీ.
*****

కృష్ణ మోహను లీరీతి తృష్ణ తోడ
సాహి తీసేవ జేయుచు సదమలముగ
చదువులమ్మను మెప్పించి సంతసమున
ధన్య తనుగొనె చూడనీ ధరణిలోన

పృచ్ఛకులకు
***********
కం.
****
మహిళా యవధానమ్మిట
మహిళలె పృచ్ఛకులుగాను మాన్యత నొప్పన్
మహిలో నెన్నడు జూడని
మహదానందమును గొలిపె మంగళ కరమై

💐💐💐💐💐💐💐💐💐
జ్ఞానప్రసూనాశర్మ ఎల్లికంటి
కడ్తాల- రంగారెడ్డి జిల్లా


నేనిచ్చిన అంశానికి (ఆశువు ) మంచి పద్యం తో పూరణ గావించిన మహిళా అవధాని  శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి   అభినందన వందనములు🙏🙏
 అవధానం లోపాల్గొనే అవకాశం ఇచ్చిన
నిర్వహకులు శ్రీ  గోగులపాటి కృష్ణమోహన్ గారికి,   సమన్వయ కర్త శ్రీమతి  జ్ఞానప్రసూనా శర్మగారికి  గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు🙏
కొండపాక  స్వర్ణలత. 
రామాయంపేట.

 🌹🍀🌹
నా స్పందన.....శుభాభినందనల మాల.💐👏👌🏻🌹

చిక్కని కవితా ధారతొ                           
చక్కని యవధానియయ్యె  సభికుల  తోడన్                                          చుక్కా యని శ్రీదేవియు                         
చక్కటి పద్యంబు చెప్ప చతురత చూపెన్.

పాదము  పద్యము చెప్పుట           
కాదనకనె పూర్తిచేసె కర్ణామృతమై                                                    శ్రీదేవికి పద్యంబులు               
పూదండల నల్లినట్లు పొసగెను యిచటన్....

    పద్మ చిగురాల...🙏🏻🌹👏

 అనుసంధానకర్త....
శ్రీమతి జ్ఞానప్రసూన మేడం గారికి,
ప్రత్యేక శుభాభినందనలు.
చక్కని సంయోజకత్వంతో, మధురంగా పద్యాలను గానం చేస్తూ ,అవధానాన్ని రంజింపజేసారు.
 చాలా సంతోషం.🙏🏻💐🌹👏👌🏻
పద్మ చిగురాల..


ఈనాటి అవధానం నిర్వహించిన శ్రీమతి చూక్కాయ పల్లి శ్రీదేవి గారికి శుభాభినందనలు..వారు మరెన్నో అవధానాలు నిర్వర్తించాలని కోరుతున్నాను..అలాగే మంచి గళం..ధారణ గల్గిన శ్రీమతి ప్రసూన చక్కగా సమన్వయం చేశారు..వారికి కూడా అభినందనలు.. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి ధన్య వాదములు 💐💐💐
లక్ష్మీ మదన్, హైదరాబాదు

నా అంశం కు మంచి పద్యం తో పూరణ గావించిన మహిళా అవధాని గారు శ్రీదేవి గారికి అభినందను వందనములు  🙏 నాకు మహిళా అవధానం లో పాల్గొనే అవకాశం ఇచ్చిన నిర్వహకులు గోగులపాటి గారికి , సంధాన కర్తగా వ్యవహరించిన ప్రసూన గారికి నమస్కారములు 🙏 అవధానం లో అన్ని అంశాల పూరణలు చాలా చక్కగా పూరించారు మరొక్క సారి నమస్కారములు ,ధన్యవాదములు 🙏🙏
దృశ్య శ్రవణ మహిళా అవధానం లో నేను పాల్గొనటం మొదటిసారి  నాకు చాలా సంతోషాన్ని కలిగించింది గోగుల పాటి గారికి ప్రత్యేక అభివందనములు 🙏
సింగీతం సంధ్యారాణి

 అవధానులు చుక్కాయిపల్లి శ్రీదేవిగారు :మహిళామణీ ;అనిపించుకున్నారు అన్ని అవధాన ప్రక్రియలను అలవోకగా అర్థవంతంగా సారూప్యముగా పూరించారు
ఆ సరస్వతి కటాక్షవీక్షణాలు సదా మీపై ఉండాలని కోరుకుంటున్నాను
ఇందులో నేనూ భాగస్వామ్యం పొందినందులకు ధన్యురాలనూ
మహిళలకి ఇలాంటి మంచి కార్యక్రమం కల్పించిన క్రిష్ణమోహన్ గారికి క్రుతజ్ఞతాంజలులు .ప్రసూనగారి సమన్వయం ముదావహం
మహిళలందరికి గర్వకారణం
సదా సాహిత్యాభిలాషి
ముదిగొండ మణిమాల 
భాషోపాధ్యాయిని  వర్గల్

: చక్కని పదములపొందిక
మక్కువకలిగించు భావమాధుర్యమ్మున్ !
చుక్కాయి పల్లి అక్కయ
యక్కజమనిపించెమీదుయవధానంబే!
చాలా బాగాచేసారు . అభినందనలు  👍🌸👏😊మీ
ముత్యంపేట గాయత్రీదేవి , నాచారం హైద్రాబాద్


ఈ ఉదయం అద్భుతమైన దృశ్యశ్రవణానంద‌దాయకమైన మహిళావధానం చూస్తూ విని ఆనందించడం తో ఆరంభమైంది.
క్రూర కరోనా ఎంతో మహమ్మారి ఐనా కావలసినంత తీరిక నిచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు వీక్షించే యోగాన్ని కలిగించింది. దృశ్య శ్రవణ మాధ్యమాన్ని ఇలా మన సనాతన సాంప్రదాయిక సాహిత్య కళకు కూడా ఇంత అందంగా వినియోగించుకోవచ్చునని నిరూపించిన మాన్య మిత్రులు శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఎందరెందరో అవధానులకు మంచి అవకాశాలు ఇప్పించి వారి అంతర్గత ప్రతిభను బహిర్గతపరిచే గొప్ప పనికి పూనుకున్నారు. మీ పూనిక గొప్పది.
ఇక ఇవాళ నేను విన్న మహిళావధానం ఒక్క మాటలో చెప్పాలంటే రమణీయం.
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీ దేవి గారి పద్యాలు ఉత్తరోత్తరగరీయసిగా ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు అర్ధవంతమైన ఛందస్సుందరమైన సమాధానాలు చెప్పారు. ప్రతి పద్యం ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అన్నీ సమతూకంలో సరళ సుందరంగా ఉన్నాయి. వారికి హార్దికాభివందనములు.
ఇక శ్రీమతి జ్ఞాన ప్రసూన శర్మగారి నిర్వహణ ఆద్యంతం హృద్యంగా సాగింది.
మహిళలు ఎంతో నేర్పుగా, కుదురుగా, నిష్ఠతో ,సేవాభావంతో ఏపనినైనా నిర్వహించగలరని ఈ అవధానం నిరూపించింది. ప్రాశ్నకురాళ్ళు ప్రశ్నలను సమర్ధంగా సంధించారు. శ్రీ రాముడు సీత పాదాలకు లత్తుక నద్దినప్పడు శూర్పణఖ మనోభావాలను అడగడం, జంబూకంబున కక్కగావలె సుమా...వంటి సమస్యనివ్వడం వంటి మంచి ప్రశ్నలు వచ్చాయి. అష్ట లక్ష్ములు
అడిగిన అన్ని ప్రశ్నలకు దీటైనసమాధానాలు వచ్చాయి. 
మనదగ్గర మహిళావధానులు లేరు అనే కొరతను తీరుస్తోంది ఈ అవధానం. ప్రాశ్నికుల్లోంచికూడా అవధానులు వచ్చే అవకాశం ఉంది. ముందుగా జ్ఞాన ప్రసూన శర్మగారితో అవధానం చేయించవచ్చు. కృష్ణ మోహన్ గారూ ఆలోచించండి.
అభినందనలతో...
         మరుమాముల దత్తాత్రేయ శర్మ


మహిళామణుల వధానము 
సుహితప్రదమై శుభమ్ము సూచించెను  భూ 
రుహములు వారలు నిజముగ 
సహనమునను సాహితీ విశారదఫణితిన్ 
.....దోరవేటి

ఈ అవధానం యూట్యూబ్ లో వీక్షించుటకై
https://youtu.be/a3Q-FY7AE_w

స్వస్తి
మీ 
గోగులపాటి కృష్ణమోహన్